ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, తదితర అంశాలపై సీఎం జగన్‌తో నిక్ వుజిసిక్ చర్చించారు. ఇందులో ప్రత్యేకత ఏముంది సీఎంను ఎందరో కలుస్తారు అంటారా. నిక్ అందరిలాంటివాడు కాదు. విధి చిన్నచూపు చూసినా శరీరం సహకరించకపోయినా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో తనను తాను మల్చుకున్నారు. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోయేవారు, బతకడం చేతకాక ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించేవారు ఒక్కసారి నిక్‌ను ఆయన జీవితాన్ని గమనిస్తే సిగ్గుతో తలవంచుకుంటారు. నికోలస్ జేమ్స్ వుజిసిక్ వయసు నలభై ఏళ్లు. ఆస్ట్రేలియాలో జన్మించారు. టెట్రా అమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్లు చేతులు లేకుండా పుట్టారు. తల్లిదండ్రులు ఆ బిడ్డను దేవుడి ఆశీర్వాదంగా భావించి అక్కున చేర్చుకున్నారు.
తండ్రి సాయంతో నిక్ ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నారు. సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నారు. గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నారు. నిక్ పాదాల వ్రేళ్ళు కలిసిపోయి ఉన్నందున డాక్టర్లు శస్త్రచికిత్స చేసి వాటిని విడదీశారు. ఆ వేళ్లతో వస్తువులను పట్టుకోవటానికి, పుస్తకంలోని పేజీని తిప్పడానికి, ఇతర పనులకు చేయడానికి వీలయ్యింది. అతను తన పాదాలతోనే విద్యుత్ చక్రాల కుర్చీని నడపడం, కంఫ్యూటర్, మొబైల్ ఫోన్ లను ఉపయోగించడం చేస్తారు. ఒకానొక దశలో నిక్ ఆత్మహత్యాయత్నం చేసాడు. ఆ తరువాత మనసు మార్చుకుని తనకున్న అవకలనాన్ని అధిగమించి తానేంటో నిరూపించుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. టీనేజ్‌లో అనేక వేధింపులకు గురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ అధిగమించారు నిక్. ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో నిక్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ, ఆర్థిక ప్రణాళిక అంశాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేశారు.
2005లో లైఫ్ వితౌట్ లింబ్స్ అనే లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థను ప్రారంభించారు నిక్. 2007లో ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ అనే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కంపెనీని స్థాపించాడు. ద బటర్‌ఫ్లై సర్కస్ అనే ఒక లఘు చిత్రంలో కూడా నటించారు నిక్. 2010లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటునిగా ఎంపికయ్యారు. 2011లో ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ సంస్థ ద్వారా సమ్‌థింగ్ మోర్ అనే మ్యూజికల్ వీడియోను విడుదల చేసారు. 2002 మార్చి 9న అతను ఆస్ట్రేలియా నుంచి కాలిఫోర్నియాకు షిఫ్టయిన నిక్ 2012 లో మియహరాను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. బతకడమే కష్టమైన స్థితిలో నిలదొక్కుకుని ఎంతోమందికి ప్రేరణ ఇస్తున్న నిక్ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఒక అధ్యాయంగా చేర్చింది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో పర్యటించిన నిక్ గుంటూరులో పాఠశాలను సందర్శించారు. తన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ బుక్‌లో ఫస్ట్ లెసన్ ఓపెన్ చేస్తే నా గురించే ఉంది. థ్యాంక్యూ ఇండియా, థ్యాంక్యూ చిల్డ్రన్, థ్యాంక్యూ సీఎం అని భావోద్వేగానికి గురయ్యారు.