పార్టీ ఫిరాయిస్తే అనర్హతా వేటు వేస్తారు కానీ అది అధికార పార్టీ వారు ఫిరాయిస్తేనే. ప్రతిపక్షంలో వారు అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏ చర్యలు తీసుకోరు. అయితే ఇప్పుడు అధికార పార్టీ సభ్యులు ఫిరాయించినా ధిక్కరించినా అధికార పార్టీలు చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎంత తీవ్రంగా విసిగిస్తున్నా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా ఇంకేం చేయగలమని అంటున్నారు. అధికారం చేతిలో ఉన్నా చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. డీఎస్ శ్రీనివాస్ విషయంలో బీఆర్ఎస్, రఘురామ, కోటంరెడ్డి, ఆనం వంటి వారి విషయాల్లో వైఎస్ఆర్సీపీ ఆయా సభ్యులను కనీసం సస్పెండ్ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోతోంది. దీనికి కారణం ఏమిటి వారు ఎప్పటికైనా మారుతారని ఆ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయా. అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తే పెద్ద గండం అని భయపడటమా. సస్పెండ్ చేస్తే నిరభ్యంతరంగా వేరే పార్టీలో చేరిపోతారని చూసీ చూడనట్లుగా ఉంటున్నారా.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. సీఎం ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఇంటలిజెన్స్ చీఫ్ తనకు పంపిన ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. అదే సందర్భంలో ఆయన తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనపై వేటు వేయడానికి ఇది సరిపోతుంది. అనర్హతా వేటు వేయడానికి ఇబ్బంది ఎదురైనా పార్టీ నుంచి మాత్రం క్షణకాలం ఆలస్యం చేయకుండా సస్పెండ్ చేయవచ్చు. అంతకు ముందు ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అంతకు ముందు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సస్పెండ్ చేస్తారని ప్రచారం చేశారు కానీ. చివరికి ఆనంను పిలిపించి జగన్ బుజ్జగించారు. వాళ్ల ఉద్దేశాలు స్పష్టంగా తెలిసిన తరవాత ఇక వారిపై ఏం చర్యలు తీసుకుంటామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. అంటే ఆ ఎమ్మెల్యేలపై వైసీపీ పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అర్థమవుతుంది.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే కాదు. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలోనూ అంతే. ఆయన పార్టీని ధిక్కరించడమే కాదు వైసీపీ పరువును ఢిల్లీలో నడి రోడ్డుపై పడేస్తున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేయిస్తామని చాలా ప్రకటనలు చేశారు కానీ కనీసం ఓ అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా మానుకున్నారు. అయితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కాస్తంత అయినా పరువు నిలబడేది. ఇప్పటికీ ఆయనను రెబల్ వైసీపీ ఎంపీగానే పిలుస్తున్నారు. దీంతో వైసీపీ పరువు పోతోంది. అయినా ఆయనపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ హైకమాండ్ సిద్ధపడటం లేదు. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అని ఆయన సవాల్ చేస్తూనే ఉన్నారు. అది వినపడనట్లుగా వైసీపీ అధినాయకత్వం వ్యవహరిస్తూనే ఉంది.
ఒక్క వైసీపీనే కాదు. తెలుగుదేశం పార్టీ కూడా ఆ పార్టీ కూడా అంతే. ఆ పార్టీ అనర్హతా వేటు వేయించలేకపోవచ్చు కానీ వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయవచ్చు కానీ చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. రాజ్యసభ సభ్యుడు డీఎస్ ను సస్పెండ్ చేయాలని తీర్మానం కూడా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శాఖ చేస్తే అమలు చేయలేదు. ఆయన పదవి కాలం పూర్తయ్యే వరకూ చూస్తూనే ఉన్నారు. ఆయన మధ్యలో కాంగ్రెస్ లో చేరినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆయనపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసి అనర్హతా వేటువేయవచ్చు. కుదరకపోతే పార్టీ నుంచి అయినా సస్పెండ్ చేయవచ్చు. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ రెండూ చేయలేదు. ఆయన నిక్షేపంగా తన పదవీ కాలాన్నిపూర్తి చేసుకున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కు ప్లస్ ఏమిటంటే డీఎస్ బీఆర్ఎస్ పరువు తీసేలా ప్రెస్ మీట్లు పెట్టలేదు.
పార్టీని ధిక్కరించిన వారిపై అనర్హతా వేటు వేయడం వారి చేతుల్లో పని కానీ చేయడం లేదు. వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయి. ఈ ఉపఎన్నికల్లో గెలిస్తే తమకు ప్రజా వ్యతిరేకత లేదని అర్థం అయిపోతుంది. ఓడితే ప్రజా వ్యతిరేకత బయట పడుతుంది. అందుకే ధిక్కరణ నేతలైప ఎలాంటి చర్యలను తీసుకోబోమని చెబుతున్నారన్నఅభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ విషయానికే వస్తే ఎన్నికలకు ఇంకా పదిహేను నెలలకుపైగా సమయం ఉంది. ఇప్పుడు వారి సభ్యత్వాన్ని రద్దు చేసేస్తే కనీసం నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆతర్వాత ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఉపఎన్నికల్లో గెలుపోటములు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి.
ఒక వేళ అనర్హతా వేటు వేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇక నేరుగా వెళ్లి వారు తమకు కావాల్సిన పార్టీలో చేరుతారని ఇక జంకూ గొంకూ లేకుండా పార్టీపై విమర్శలు చేస్తారని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. కారణం ఏదైనా ఇప్పుడు రాజకీయ పార్టీలు నేతలు తమను ధిక్కరించినా చర్యలు తీసుకోలేనం దీన స్థితికి వెళ్లిపోయాయి. అంటే వారు పరువు తీస్తున్నా ఏమీ చేయలేని రాజకీయం వచ్చేసిందన్నమాట.