కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై తాలిబన్ల సంబరాలు

By KTV Telugu On 3 February, 2023
image

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. బడ్జెట్‌ పై ఆంధ్రప్రదేశ్‌ సానుకూలంగా స్పందిస్తే తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. అయితే ఎవరూ ఊహించనివిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల ప్రశంసలు లభించాయి. ఈ బడ్జెట్ లో ఆఫ్ఘనిస్థాన్ కు సాయం ప్రకటించడాన్ని తాలిబన్ పాలకులు స్వాగతించారు. బడ్జెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి రూ.200 కోట్ల సాయం ప్రకటించారు నిర్మలా సీతారామన్. అఫ్ఘనిస్థాన్ ప్రజలను ఆదుకునేందుకు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం తరఫున ఈ మొత్తాన్ని సాయంగా అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు షాహీన్ చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అమెరికన్ సేనలు వెళ్లిపోయిన తరువాత 2021లో ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నవిషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశాన్ని తాలిబన్ ప్రభుత్వమే పాలిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. దాంతో ఆ దేశం ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆర్థికం సంక్షోభం నెలకొంది. అమెరికాలోని బ్యాంకుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అకౌంట్లపై ఆ దేశం ఆంక్షలు విధించింది.

దీంతో అంతర్జాతీయ సమాజంలో ఆ దేశం ఒంటరిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్ ఎంతో ఉదారతతో ఆఫ్ఘన్ కు ఆహార పదార్థాలు వైద్య సాయం అందిస్తోంది. ఇప్పుడు బడ్జెట్‌లో భాగంగా 200 కోట్ల రూపాయలు ఆ దేశాభివృద్ధి కోసం కేటాయించింది. దీనిపై తాలిబన్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన భారత ప్రాజెక్టులు మళ్లీ మొదలైతే భారత్ ఆఫ్ఘన్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తాలిబన్ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్గనిస్తాన్‌కే కాకుండా తనతో సఖ్యతగా ఉన్న మిత్రదేశాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కొంతసాయం ప్రకటించింది. భూటాన్‌కు 2400 కోట్లు, నేపాల్‌కు 550 కోట్లు మారిషస్‌కు 460 కోట్లు, మాల్దీవులకు 400 కోట్లు, మయన్మార్ కు 400 కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు 250 కోట్లు బంగ్లాదేశ్‌కు 200 కోట్లు కేటాయిపులు చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ బడ్జెట్లో విదేశాలకు సాయం కింద అందించే ప్యాకేజీని 5848 కోట్లకు తగ్గించాల్సి వచ్చిందని భారత్ ప్రకటించింది