ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది. తన ట్యాపింగ్ ఆరోపణలతో మొత్తం ప్రభుత్వం షేక్ అవుతుందనుకున్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. కేంద్ర దర్యాప్తుసంస్థలు రంగంలోకి దిగుతాయని భ్రమపడ్డట్లున్నారు. నోట్ల కట్టలు చేతికిస్తూ దొరికిన రేవంత్‌రెడ్డే టీపీసీసీ హోదాలో దర్జాగా తిరుగుతున్నారు. ఫాంహౌస్‌కు వచ్చి బేరసారాలాడిన పెద్దలు బయటికొచ్చారు. ఇక ట్యాపింగ్ ఆరోపణలతో ఏదో జరిగిపోతుందని ఎలా అనుకున్నారో పాపం. ఆయన ఆరోపణల వేడి ఆ ఒక్కరోజే. మర్నాడే నెల్లూరు రూరల్ బాధ్యతలను అధిష్ఠానం ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆయనే పార్టీ అభ్యర్థి అని ప్రకటించింది.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పుడు పేరుకే ఎమ్మెల్యే. ఆయన మాట నడవదు. ఆయన చెబితే ఒక్క పనీ జరగదు. పైగా కొన్ని వేధింపు చర్యలు మొదలుకావచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అధికారపార్టీ టార్గెట్. పాత కేసులూ గట్రా ఏమన్నా ఉంటే వాటి దుమ్ము కూడా దులిపే అవకాశం ఉంది. టీడీపీ నేతలతో కోటంరెడ్డి ముందే మాట్లాడేసుకున్నారంటోంది వైసీపీ. ఆయన చంద్రబాబుని కూడా కలుసుకున్నారని పేర్నినాని డేట్ కూడా చెప్పేస్తున్నారు. కానీ కోటంరెడ్డిని టీడీపీలో కొందరు కోవర్టుగా చూస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు అనుమానాస్పదమేనంటున్నారు. టీడీపీకి నష్టం కలిగించేందుకు వైసీపీ వ్యూహంలో ఇవన్నీ భాగమేనని అనుమానిస్తున్నారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తమ్ముళ్లను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్ ఆ పార్టీలో కొందరి అనుమానాలకు అద్దం పడుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పేర్లను నేరుగా ప్రస్తావించపోయినా వైసీపీలో వారి ఎపిసోడ్లను దృష్టిలో పెట్టుకునే బుచ్చయ్యచౌదరి ఈ కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఆనం కుటుంబంతో కొట్లాడారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. వైసీపీలోకి వచ్చాకే ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికింది. అలాంటి పార్టీపైనే దుమ్మెత్తిపోసిన నాయకుడిని టీడీపీ నమ్ముతుందా అన్నదే ప్రశ్న. కానీ పార్టీ మారేందుకు ముందునుంచే తన ఏర్పాట్లలో ఉన్నారు కోటంరెడ్డి. అనుచరులతో ఆయన మాట్లాడిన మాటలు పార్టీ పెద్దల చెవికి చేరాయి. మరోవైపు ట్యాపింగే జరగలేదన్న వాదనని వైసీపీ గట్టిగా వినిపిస్తోంది. ట్యాపింగ్ అని నిరూపించాలని సవాల్ చేస్తోంది. ట్యాపింగ్ కాకపోతే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని కోటంరెడ్డిపై ఒత్తిడిపెంచుతోంది. మరోవైపు సీఎం కూడా కోటంరెడ్డి ఆరోపణల నిగ్గుతేల్చాలని ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్‌తో కోటంరెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ ముందే ప్రయోగించటంతో ఆయన కొత్తగా చెప్పడానికేం లేదు. జరిగేది మౌనంగా, నిస్సహాయంగా చూడటం తప్ప ఆయన చేయడానికి కూడా ఏమీ లేదు.