తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత విభేధాలు బహిరంగమవుతున్నాయి. అవసరం లేకపోయినా ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడం .. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రత్యర్థి పార్టీ ఉండకూడదని ఏదో ఓ పదవి ఆశ పెట్టి గత ఏడేళ్లుగా అందర్నీ గులాబీ కారు ఎక్కించడంతో ఇప్పుడు కారు ఓవర్ లోడ్ అయిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతూండటంతో అవకాశాలు కోసం కారులో ఉండి ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారు పక్కచూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో చాన్స్ ఇస్తే సరే లేకపోతే ఏం చేస్తామో చూస్తారంటూ శాంపిల్ బలప్రదర్శన చేస్తున్నారు. కొల్లాపూర్లో ఇటీవల జరిగింది అదే. అయితే అది ఒక్కటే కాదు. తెలంగాణ ఏ వైపు చూసినా… టీఆర్ఎస్లో వర్గ పోరు ఇదే విధంగా ఉంది.
జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన అధినేత కేసీఆర్… రాష్ట్ర పార్టీని పెద్దగా పట్టించుకోకపోవడంతో విబేధాలు తారాస్థాయికి చేరాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు, విదేశీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టారు. కానీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడంతో వర్గపోరు ఉమ్మడి పదిజిల్లాల్లో తారాస్థాయికి చేరింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలంతా గులాబీ గూటికీ చేరారు. దీనికి తోడు 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ల స్థానంలో పార్టీ నేతలకు అవకాశం కల్పించడంతో, ఇతర పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరడంతో పాత, కొత్త నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దీనికి తోడు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకే నియోజకవర్గానికి బాస్ లను చేయడంతో మాజీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గింది. ఇప్పటికే భిక్షమయ్యగౌడ్, తాటి వెంకటేశ్వర్లు, నల్లాల ఓదెలు వంటి వారు రాజీనామా చేశారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజీనామా బాట పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఆశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్ లో గుర్తింపు లేదని బీజేపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు భిక్షమయ్యగౌడ్కు వర్గపోరు నడుస్తుండటం, రాబోయే ఎన్నికల్లో సైతం టికెట్ రాదని భావించి పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు సైతం టీఆర్ఎస్ను వీడారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ వేధింపులతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి, కాంగ్రెస్ గూటికి చేరారు. ఉమ్మడి పది జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంది.
రంగారెడ్డి జిల్లా తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య వర్గపోరు ఏ దిశగా వెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఇద్దరి మధ్య ఘర్షణ మాత్రమే మిగిలింది. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు పార్టీలో ఉంటారో ఉండరో చెప్పడం కష్టం. కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నువ్వా నేనా అనే వార్ డిక్లేర్ అయింది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఉప్పల్ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల మధ్య టిక్కెట్టు పోరు నడుస్తోంది. మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య రచ్చ ఎప్పటికప్పుడు రోడ్డున పడుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి నియోజకవర్గంలో వర్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా పదుల సంఖ్యలో సొంత పార్టీ నేతల మద్య గ్రూపులు, వర్గ విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి.ముఖ్యంగా ఫిరాయింపు నేతలు ఉన్న చోట్ల ఎక్కువ గొడవలు ఉన్నాయి.
రోడ్డున పడటం అంటే ఏమిటో ఇప్పుడు టీఆర్ఎస్కు తెలిసి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు నేతల మధ్య విభేదాలు కొత్త తలనొప్పిని తీసుకువచ్చాయి. జాతీయ రాజకీయాలు కాదు.. ముందు పార్టీని చక్కదిద్దుకోవలసిన పరిస్థితి అనివార్యమైంది. అయితే అధిష్టానం ఇప్పటికే కొంతమంది నాయకులను మందలిచ్చినప్పటికీ వారి వైఖరీ మారలేదు. ఎదురుగా ప్రత్యామ్నాయాలు కనిపిస్తూండటంతో మరింతగా గేమ్ ఆడుతున్నారు. ఈ పరిస్థితిని కేసీఆర్ కాస్త దృష్టి పెట్టి చక్కదిద్దకపోతే టీఆర్ఎస్ను టీఆర్ఎసే ఓడించుకున్నట్లవుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.