అదానీ.. పతనం అథ:పాతాళానికేనా

By KTV Telugu On 3 February, 2023
image

అదానీ కొంపలో చిచ్చుపెట్టింది హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక. అంబానీని మించిపోయేలా అదానీ నిర్మించిన కలల సామ్రాజ్యం కూలిపోతోంది. అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్‌ నిలువెల్లా వణికిపోతోంది. కాలూచేయి కూడదీసుకునే అవకాశం లేకుండా దెబ్బమీద దెబ్బ పడుతోంది. నివేదిక వచ్చిన రోజునుంచీ అదానీ గ్రూప్‌ షేర్ల పతనం ఆగడంలేదు. రోజుకి ఇంతకుమించి పడకుండా లోయర్‌ సర్క్యూట్‌ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఈపాటికి అదానీ షేర్లన్నీ గుండుసున్నా చుట్టేసుండేవి. అమ్మకాల ఒత్తిడితో చివరికి పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయిన ఎఫ్‌పీవోను అదానీ గ్రూప్‌ నిలిపేసింది. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులతో గతంలో ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన రూ.20వేల కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనుంది.

అదానీ గ్రూప్‌ వ్యవహారంలో హిండెన్‌ బర్గ్‌ అభియోగాలతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా జోక్యం చేసుకుంది. అదానీ గ్రూప్‌ కంపెనీల వివరాలు ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు ఏయే బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయో ఆర్బీఐ ఆరాతీస్తోంది. అయితే అధికారికంగా ఆర్బీఐ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు సిటీ బ్యాంక్‌ గ్రూప్‌ తీసుకున్న నిర్ణయంతో అదానీ గ్రూప్‌ పెనంమీదినుంచి పొయ్యిలో పడింది. అదానీ గ్రూప్‌ సెక్యూరిటీస్‌పై తమ క్లయింట్లకు రుణాలు ఇవ్వకూడదని సిటీ బ్యాంక్‌ నిర్ణయించింది. క్రెడిట్‌ సూయిజ్‌ ఏజీ కూడా అదానీ గ్రూప్‌ బాండ్లపై రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. బాండ్లకు విలువను జీరోగా పేర్కొనటంతో అదానీ గ్రూప్‌ పతనం పతాకస్థాయికి చేరేలా కనిపిస్తోంది.

మదుపుదారులను సంక్షోభంలో పడేసిన అదానీ గ్రూప్‌ నిర్వాకం ఉభయసభలను వేడెక్కించింది. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. స్పీకర్‌ అంగీకరించకపోవటంతో విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో సభను మధ్యాహ్నందాకా వాయిదావేయాల్సి వచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టటంతో చివరికి సభా కార్యక్రమాలు జరగలేదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షపార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎఫ్‌పీవోని వెనక్కి తీసుకుంటున్నట్టు అదానీ భావోద్వేగ ప్రసంగం చేసినా అతన్నెవరూ నమ్మడంలేదు. అదానీ గ్రూప్‌ పతనం పాతాళానికి చేరేసరికి ఎంతమంది ఆశలు భూస్థాపితం అవుతాయో చూడాలి.