అశ్విన్‌ డూప్లికేట్‌తో ఆస్ట్రేలియా ప్రాక్టీస్

By KTV Telugu On 3 February, 2023
image

టీ 20, వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా ఉన్న టీమిండియా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియా వచ్చిన ఆస్ట్రేలియా కూడా ప్రాక్టీస్‌కు మొదలుపెట్టింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవడానికి ఇరు జట్లకూ ఇది కీలకం కానుంది. అయితే భారత గడ్డపై పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని గ్రహించిన ఆస్ట్రేలియా అశ్విన్ లాంటి ప్రమాదకర బౌలర్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా వెళ్తోంది. అశ్విన్‌ లాంటి డూప్లికేట్ బౌలర్‌ను బెంగళూరులోని తమ శిబిరానికి రప్పించుకుంది. మహీశ్ అనే యువ బౌలర్ అచ్చం అశ్విన్‌ మాదిరిగానే బంతులను సంధించడాన్ని సోషల్‌ మీడియాలో ఆసీస్ కోచింగ్ బృందం చూసింది. దీంతో అతడిని పిలిపించుకుంది. గతేడాది డిసెంబర్‌లో బరోడా జట్టు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన 21 ఏళ్ల మహీశ్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

స్పిన్‌ బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై టీమిండియాతో సిరీస్‌ అంటే ఆషామాషీ కాదు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా సొంతగడ్డపై అశ్విన్ ఎలా రెచ్చిపోతాడో ఆసీస్‌ బ్యాటర్లకు గతానుభవమే. అందుకే అచ్చం అలాంటి బౌలింగ్‌ చేయగల గుజరాత్‌ బౌలర్‌తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రాక్టీసు చేస్తున్నారు. అశ్విన్‌ వేసే ఫ్లైటెడ్‌ డెలివరీలను ప్రాక్టీస్‌ చేసేందుకు ఆసీస్‌ బ్యాటర్లు మహీశ్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసుకొన్నారు. బెంగళూరులోనే ఆసీస్‌కు నాలుగు రోజుల ట్రైనింగ్‌ క్యాంప్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. 2017లో ఆస్ట్రేలియా చివరిగా సారిగా భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆడింది. అప్పుడు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈసారి అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, వీరిద్దరికి తోడు అద్భుత ఫామ్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ రూపంలో ఆసీస్‌ బ్యాటర్లకు ముప్పు ఎదురుకానుంది.

టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఒకటి. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్‌ చాలా చిరస్మరణీయ క్షణాలను అందించింది. ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఇండియా ఆస్ట్రేలియాను ఓడించాల్సిన అవసరం ఉంది. 2020-21 ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.