ఇరగదీస్తోన్న యంగ్ ప్లేయర్లు.. టీమిండియాలో టఫ్ కాంపిటీషన్‌

By KTV Telugu On 4 February, 2023
image

భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదు. కబడ్డీ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఎన్ని ఆటలు ఉన్నా ఎక్కువ మంది బాల్, బ్యాట్ పట్టేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. చూసే వీక్షకులు కూడా పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువ మంది క్రికెట్‌ను ఇష్టంగా చూస్తారు ఆరాధిస్తారు. దాంతో సహజంగానే క్రికెట్‌పై మక్కువ ఉండడంతో పోటీ కూడా ఎక్కువే. దాంతో జాతీయ జట్టులో స్థానం కోసం క్రికెట్ జట్టులో టఫ్ కాంపీటీషన్ ఉంటోంది. ఐపీఎల్ పుణ్యామా అని యంగ్ ప్లేయర్లు చాలా మంది వెలుగులోకి వస్తుండడంతో పోటీ తీవ్రతరమవుతోంది. దాంతో సెలెక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అద్భుతంగా ఆడే ఆటగాళ్లకు మన దగ్గర కొదవలేదు. కానీ అలా అని అందరినీ ఆడించడం కష్టం. స్వదేశీ, విదేశీ పిచ్‌లపై ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లు, అనుభవం, ప్రత్యర్థి జట్టుపై ఎత్తులు, పై ఎత్తులు ఇలా వేసే వ్యూహాలు, ఫామ్‌, ఫిట్‌నెస్‌ ఉన్న ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేస్తుంటారు.

అయితే ఈ మధ్య కాలంలో యంగ్ ప్లేయర్లు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నారు. చాలామంది తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వారిలో కొందరికి అవకాశాలు లభిస్తున్నాయి. కొందరికి లభించడం లేదు. ఛాన్స్ వచ్చిన వారు కొందరు నిరూపించుకుంటున్నారు. కొందరు నిరూపించుకోవడం లేదు. ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయినా కొందరినీ నిర్ధాక్షిణంగా పక్కనబెట్టేస్తున్నారు. మరికొందరు ఏదో ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే చాలు వారు ఫామ్‌లో లేకపోయినా కొనసాగిస్తున్నారు. తమ వాడనుకుంటే చాలుజట్టులో కొనసాగే వివక్ష ఉంది. అది కెప్టెన్ కావొచ్చు సెలెక్టర్లు కావొచ్చు. అందుకే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొన్నటిదాకా టీమిండియాకు పంత్ ఆశాకిరణమన్నారు. ఆ తర్వాత అతని ఫెయిల్యూర్‌తో సంజూ శాంసన్ ఇషాన్‌ లాంటి వారిని జట్టులోకి తీసుకోవాలనే ప్రెజర్ సెలెక్టర్లపై పడింది. సంజూనూ అప్పుడప్పుడూ టూరిస్టులా జట్టులోకి వచ్చిపోతున్నాడు. ఇషాన్ ఈ మధ్య ఎక్కువగా ఛాన్స్‌లు అందిపుచ్చుకుంటున్నా డబుల్ సెంచరీ మినహా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ స్టార్‌గా వెలిగిపోతున్నాడు. వరుస సెంచరీలతో చెలరేగుతోన్న ఈ ఓపెనర్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఇంతకాలం కేఎల్ రాహుల్ సరిగా రాణించకపోయినా ఆడించారు. కానీ గిల్ ఇషాన్ సహా మరికొందరు ఓపెనర్ల పోటీ ఎక్కువ కావడంతో సీనియర్‌ ప్లేయర్ రాహుల్‌ జట్టులో చోటు కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

వచ్చే ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్‌లను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఇప్పటికే టీ20లు వన్డేలకు వేర్వేరు టీమ్‌లను ఎంపిక చేస్తున్నారు. వన్డేలు టెస్టుల్లో రోహిత్ సారథ్యంలో జూనియర్లు, సీనియర్లకు చోటు కల్పిస్తున్నారు. టీ 20ల్లో మాత్రం పూర్తిగా యంగ్ ప్లేయర్లతో ఆడిస్తూ టెస్టింగ్ పెడుతున్నారు. ప్రస్తుతం రంజీల్లో రాణిస్తున్న పృథ్వీషా, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. పృథ్వీ షాను టీ20ల్లోకి తీసుకోవాలని కొందరు సలహాలు ఇస్తుంటే మరికొందరు సర్ఫరాజ్‌ను బోర్డర్ గవాస్కర్ టోర్నీలో ఆడించాలని కోరారు.

శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి సహా మరికొందరు యువ ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. మహ్మద్ సిరాజ్ ఉమ్రాన్ మాలిక్ శార్దూల్ ఠాకూర్ సహా మరికొందరు యంగ్ బౌలర్లు టీమిండియాకు ఆశాకిరణంగా మారుతున్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్లు మన దగ్గర ఉన్నారు. వారిని సానబెడితే రానున్న రోజుల్లో టీమిండియాకు క్రికెట్‌లో తిరుగుండందంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన భారత్. శ్రీలంక, న్యూజిలాండ్‌లపై వన్డే, టీ 20సిరీస్‌లను కైవసం చేసుకుంది. అంతేకాదు 20ఓవర్లు, 50ఓవర్ల ఆటలో అగ్రస్థానంలో మనమే ఉన్నాం. ఇక రానున్న ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆటగాళ్లకు అసలు సిసలైన అగ్నిపరీక్ష అనే చెప్పాలి. కంగారులపై కప్ కొడితే టెస్టుల్లోనూ రారాజులుగా నిలవడంతో పాటు రానున్న మెగా టోర్నీల్లో టీమిండియా కప్ కొట్టగలదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అనలిస్టులు అభిమానులు.