భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ అయింది. అంత మాత్రాన మూలాల్ని మర్చిపోతే మొదటికే మోసం వస్తుంది. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడానికి సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు కానీ తెలంగాణలో పార్టీ పరిస్థితి మాత్రం చిందర వందర అవుతూంటే పట్టించుకునేవారు కరువయ్యారు. జిల్లాల్లో అధికారం అంతా మంత్రులకే ఇవ్వడం. పేనుకు పెత్తనం ఇచ్చినట్లుగా మారుతోంది. ఫలితంగా పార్టీలో గ్రూపులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్లో రెండు మూడు వర్గాలు బహిరంగంగా కత్తులు దూసుకుంటున్నాయి. ఈ రాజకీయాలపై హైకమాండ్ దృష్టి పెట్టకపోతే మూలాల్లో బీఆర్ఎస్ భారీగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు నగర పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అవిశ్వాసాలే కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి కొనసాగుతోంది. కొన్నిచోట్ల చైర్మన్లు వైస్ చైర్మన్ స్థానాల్లో ఉన్నవారు ఆధిపత్య పోరాటంతో ఇతరులకు దూరంకావడం. ఇతరులు పదవులపై ఆశలు పెంచుకున్న నాయకులు తమ పైస్థానంలో ఉన్నవారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత ఒప్పందాలతో అవిశ్వాస తీర్మా నాలు ప్రవేశపెట్టి పదవుల్లో పాగావేసేందుకు ప్రయత్నిస్తున్నారు .
పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల పక్రియ పూర్తి అయిన మూడేళ్ళ వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలకు అవకాశం లేదు. అయితే మూడేళ్ళ క్రితం అంటే 2020 జనవరి 27న సర్పంచ్ ఉపసర్పంచ్లు పదవులు చేపట్టి 2023 జనవరి 27కు మూడేళ్ళు పూర్తి అయింది. ఈ మూడేళ్ళ కాలంగా అంతర్గత విభేదాలున్నా ఓపిక పట్టిన అవిశ్వాసులకు ఒక్కసారే రెక్కలు వచ్చినట్లు అయింది. కొన్నిచోట్ల పదవీకాలం చెరో సగం అన్న ఒప్పందాలు ఉల్లంఘనకు గురికావడంతో లొల్లి మొదలైంది. మరికొన్ని స్థానిక సంస్థల్లో కేవలం డబ్బుల కోసమే అవిశ్వాసాలకు సిద్ధ పడుతున్నారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన స్థానిక సంస్థల్లో ముసలం రాజుకుంది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి సంకటంగా మారింది. ఆయా నియోజకవర్గాలకు బాధ్యతల్లో ఉన్న రాష్ట్రస్థాయి కీలక నేతలకు ఇది గడ్డు కాలంగా కనిపిస్తోంది.
మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టొద్దని కేటీఆర్ ఆదేశించినప్పటికీ సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. జవహర్‌నగర్ మేయర్‌తో పాటు వికారాబాద్ తాండూరు పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాసం ప్రకటించారు. పెద్ద అంబర్‌పేటలో వైస్ చైర్ పర్సన్ పైనా అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. అవిశ్వాసాలు వద్దన్న కేటీఆర్ ఆదేశాలను జవహర్‌నగర్ కార్పొరేటర్లకు మంత్రి మల్లారెడ్డి చేరవేసినా కార్పొరేటర్లు పట్టించుకోలేదు. మేయర్ మేకల కావ్యపై తమకు విశ్వాసం లేదని 20 మంది కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ ను శనివారం కలిశారు. ఇలా అన్నిచోట్లా పదుల సంఖ్యలో అవిశ్వాస తీర్మానాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అవిశ్వాసం ప్రకటిస్తున్న వారు కూడా పట్టుదలగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు అధికార పార్టీకి అవసరం కనుక తమ డిమాండ్‌ను తప్పక అంగీకరిస్తుందన్న నమ్మకంతో వారున్నారు.
ఈ వివాదం మరింత ముదరకుండా వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మె ల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ చాలా చోట్ల వారే ఈ అవిశ్వాశాలకు కారణం అవుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ పెద్దలు ఓమాట చెప్పి ఊరుకుంటున్నారు. వారు కూడా తాము ఒకవర్గం వైపు ఉండలేమనట్లుగా ఉంటున్నారు కానీ పార్టీని చక్కదిద్దాలని ఆలోచన చేయడం లేదు. దీంతో అవిశ్వాసాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది పార్టీలో రెండు, మూడు గ్రూపుల్ని తయారు చేసి అంతిమంగా పార్టీకి నష్టం చేస్తుంది. మూలాల్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత పార్టీకైనా ముప్పే. ఆ విషయాన్ని బీఆర్ఎస్ హైకమాండ్ ఇంకా గుర్తించడం లేదు.