అగ్రరాజ్య హోదా కోసం అర్రులు చాస్తోన్న కంత్రీ డ్రాగన్ అమెరికాపై కాలు దువ్వుతోంది. యూఎస్ గగనతలంపై నిఘా బెలూన్లు వదులుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. గురువారం మోంటానా రాష్ట్ర గగనతలంలో ఓ భారీ బెలూన్ కన్పించగా తాజాగా లాటిన్ అమెరికాలో మరో దాన్ని గుర్తించారు. నిఘా బెలూన్ కాదని చైనా వివరణ ఇచ్చేలోపే ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. లాటిన్ అమెరికా రీజియన్ గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. అది చైనా గూఢచర్య బెలూనే అని తెలిపింది. అణుస్థావరం వద్ద బెలూన్ చక్కర్లు కొట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేయించింది.
ఈ బెలూన్ ఉత్తర అమెరికా రాష్ట్రాల్లోని భద్రతాపరంగా సున్నితమైన స్థావరాల మీదుగా ప్రయాణిస్తుండటం కలవరపెడుతోంది. బెలూన్ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ కు పెంటగాన్ సమాచారమిచ్చింది. పరిస్థితులను ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు శ్వేతసౌధంవెల్లడించింది. అయితే ఈ వివాదంపై స్పందించిన చైనా అది ఒక పౌర గగననౌక అని తెలిపింది. వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని గాలుల ప్రభావంతో దారి తప్పి అమెరికా గగనతలంలోకి వచ్చిందని వివరించింది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. కానీ ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. చైనా పొరపాటుగా వచ్చిందని చెబుతున్నప్పటికీ తమ తలపైన బెలూన్ ఎగరడం దేశ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అమెరికా ఆక్షేపించింది.
అంతకు ముందు అమెరికా గగనతలంలో మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఓ బెలూన్ సంచరించడం కలకలం రేపింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటైన మౌంటానాలో ప్రత్యక్షమైంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడంతో అమెరికా జాగ్రత్త పడింది. దానిని పేల్చినా కూల్చినా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళనతో కేవలం నిఘా మాత్రమే పెట్టింది అమెరికా రక్షణ శాఖ. రాబోయే రోజుల్లో దాని సంచారం ఎటువైపు ఉందో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని పెంటగాన్ పేర్కొంది. చైనాను నమ్మడానికి లేదు. చైనాతో చర్చల నిమిత్తం ఈపాటికే ఆ దేశంలో ల్యాండ్ కావాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. డ్రాగన్ చర్య ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రంగా మార్చే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.