మొన్నటిదాకా కేసీఆర్ టీం రాజ్‌భవన్ గడపతొక్కలేదు. గవర్నర్ పర్యటనలకు ముఖ్యనేతలు చివరికి ఉన్నతాధికారులు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. గవర్నర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగిపోతాయనుకున్నారు. కానీ కోర్టు జోక్యంతో తెగేదాకా లాగడం ఎందుకని ప్రభుత్వమే అనుకుందో పంతానికి పోవద్దని గవర్నర్‌కి కేంద్రమే చెప్పిందోగానీ మొత్తానికి ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసైకి గౌరవం దక్కింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసంతో తెలంగాణ సర్కారు-రాజ్‌భవన్ మధ్య అగాధం పూడినట్లయింది.
తమిళనాడు గవర్నర్ రవిలా తెలంగాణ ప్రభుత్వాన్ని తమిళిసై ఇబ్బంది పెట్టలేదు. ఇచ్చిన ప్రసంగపాఠాన్ని యథాతథంగా చదివేశారు. తానేదీ జోడించలేదు. ఉన్నవేవీ తీసేయలేదు. కేసీఆర్ సర్కారుమీద కత్తిదూస్తున్న బీజేపీకి ఈ పరిణామం మింగుడుపడటం లేదు. మొన్నటిదాకా గవర్నర్‌కి కనీస మర్యాద ఇవ్వడంలేదని నానాయాగీ చేశారు బీజేపీ నేతలు. రాజ్యాంగ సంప్రదాయాలకు బీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడుస్తోందని దుమ్మెత్తిపోశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు గవర్నర్ ప్రసంగంపైనే బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమపాలన సాగిస్తోందని ప్రజల మెప్పు పొందుతోందన్నట్లుంది గవర్నర్ ప్రసంగపాఠం. ఆమె సొంతంగా చదివిందికాకపోయినా మొన్నటిదాకా విమర్శలు గుప్పించిన నోటితోనే ప్రశంసించడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది.
చిన్నాచితకా నాయకులు కాదు స్వయానా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గవర్నర్ తమిళిసై ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తంచేయడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారని కేంద్రమంత్రి మండిపడ్డారు. గవర్నర్ ఏమన్నా రోబోటా ప్రోగ్రామ్ ట్యూన్ చేస్తే యథాతథంగా చదివేయడానికి. మొన్నటిదాకా ఎన్ని అవమానాలు పడ్డారో ఆమెకు తెలీదా. కేసీఆర్ చివరికి సభామర్యాద పాటించారని ఆమె సంతృప్తి చెంది ఉంటారు. లేదంటే పైనుంచి ఆదేశాలన్నా ఉండి ఉండాలి. అసెంబ్లీదాకా వచ్చాక సొంత స్పీచ్ ఇస్తానంటే ఎలా కుదురుతుంది. ఆమె తన పరిధి దాటలేదు. పాత అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురికాలేదు.
అసెంబ్లీలో తమిళిసై ప్రసంగంతో కేసీఆర్ కూడా హ్యాపీ. ఇక ఆమె మర్యాదలకు ఏ లోటూ ఉండకపోవచ్చు. కానీ రాజ్‌భవన్-ప్రగతిభవన్ మధ్య గ్యాప్ పెరగాలని కోరుకున్న బీజేపీ నేతలే ఈ పరిణామాలతో తీవ్ర అసహనంగా ఉన్నారు. కిషన్‌రెడ్డి ఒక్కరే కాదు ఆ పార్టీ అధికారప్రతినిధి నుంచి మొదలుకుని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌దాకా అంతా గవర్నర్ ప్రసంగంపై పెదవివిరిచారు. ఎవరెంత గింజుకున్నా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గ్రేటు. అది కేసీఆరేనని వేరే చెప్పాలా.