తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల మనసు గెలుచుకునేందుకు ఆయా పార్టీల నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో జనంలోకి వెళ్లారు. ఇక వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ప్రజాప్రస్థానం పేరుతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాసమస్యలు ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నహాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సీనియర్ నేతలు ఈ పాదయాత్ర చేస్తుండగా…రేవంత్ మేడారం నుంచి అడుగు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం పోరాడేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు.
వాస్తవానికి ఎప్పటినుంచో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ, పార్టీలో అంతర్గత విభేదాల వల్ల సాధ్యపడలేదు. పాదయాత్ర చేస్తే కేవలం రేవంత్ ఇమేజ్ మాత్రమే పెరుగుతుందని చెప్పి కొందరు సీనియర్లు మోకాలడ్డుతూ వచ్చారు. దీంతో, పాదయాత్ర పెండింగ్‌లో పడుతూ వచ్చింది. తాజాగా రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పార్టీలో పరిస్థితులని చక్కదిద్దే ప్రయత్నంచేయడం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు హాత్ సే హాత్ పాదయాత్ర ప్రారంభించడంతో ముందడుగు పడింది. అయితే అందరూ ఒకే చోట కాకుండా రేవంత్‌తో పాటు సీనియర్ నేతలు ఎవరికి వారు పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. 2 నెలల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత పాదయాత్ర ఉంటుందా లేదా అనేది పరిస్థితులను బట్టి తెలుస్తుంది.
రేవంత్ అడుగు వేయకముందే అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. రేవంత్ కేవలం తన అనుచర నేతలు క్యాడర్ ఉన్న స్థానాల్లోనే పాదయాత్ర చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. పాదయాత్రలో అందరూ పాల్గొనేలా చేయాలని పార్టీలో కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియర్లు తమకు నచ్చిన విధంగా కలిసొచ్చే స్థానాల్లో పాదయాత్ర చేయవచ్చు అని అందరూ ఒకచోట పాదయాత్ర చేయడానికి లేదంటూ ఇంఛార్జ్ నోరు మూయించే ప్రయత్నం చేశారు. మహబూబాబాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10రోజుల పాటు రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది. మొత్తంగా ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ పాదయాత్ర పార్టీకి కీలకం కానుండడంతో సాఫీగా సాగిపోయేలా హస్తం పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతలంతా చేతులు కలిపితే పార్టీకి తిరుగుండదని కేడర్ భావిస్తోంది. మరి ఈ పాదయాత్రలో రేవంత్ రెడ్డి అండ్ టీం ఏ మేరకు సక్సెస్ అవుతుంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ దగ్గరున్న వ్యూహమేంటనేది చూడాలి.