ఖమ్మం గుమ్మంలో రసవత్తర రాజకీయం.. ఎవరి దమ్ము ఎంత

By KTV Telugu On 7 February, 2023
image

తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. మొదట కమ్యూనిస్టులు ఆ తర్వాత నుంచి కాంగ్రెస్‌కు పట్టం కడుతూ వస్తున్న జిల్లా ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎవరి వైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీకి సరిహద్దుగా ఉన్న ఖమ్మంలో సెటిలర్స్ ప్రభావం ఎక్కువే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని జిల్లాల్లో దూసుకెళ్తోన్న కారు ఖమ్మం రోడ్లపై మాత్రం పల్టీలు కొడుతోంది. పక్క పార్టీల నుంచి నాయకులను చేర్చుకొని బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నా అది వాపు మాత్రమేనని తెలుస్తోంది. విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టీడీపీ వైసీపీలు జెండా ఎగరేశాయి. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, ఆ పార్టీతో పొత్తు కారణంగా టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంది. గులాబీ పార్టీ ఓ సీటు మరొకరు ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఆ తర్వాత చాలా మంది కారెక్కడంతో అంతా గులాబీమయమైంది.

అయితే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం గుమ్మంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. తెలంగాణలో పూర్వవైభవం కోసం పరితపిస్తోన్న టీడీపీ ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈసారి ఖమ్మం నుంచి కొద్దోగొప్పో సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. అటు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఖమ్మంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అంతేకాదు పొంగులేటిని పార్టీలో చేర్చుకొని జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహంతో షర్మిల పార్టీ ఉంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైసీపీ మూడు అసెంబ్లీ ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం అంతకన్నా అదనంగా సీట్లు గెలుచుకోవాలనే ప్లాన్ తో వైఎస్సార్టీపీ ఉంది. ఖమ్మంలో సీట్లు సాధిస్తే రానున్న కాలంలో మిగతా జిల్లాల్లో కూడా బలపడొచ్చనేది టీడీపీ, వైసీపీల వ్యూహంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు ఖమ్మంలో తిరుగులేదనుకున్న కాంగ్రెస్‌ను షర్మిల పరేషాన్ చేస్తోంది. జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌కు వైఎస్సార్ అభిమానులంతా షర్మిల వైపు నిలిస్తే కష్టకాలమే. కాంగ్రెస్ ఓట్లు చీలి ఆ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేసిన గులాబీ దళం, ఈసారి ఎలాగైనా జిల్లాలో సత్తా చాటాలని ఆరాటపడుతోంది. జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ ఏం హామీ ఇచ్చారో గానీ తిరిగి పార్టీలో యాక్టీవ్ అవుతున్నారు నాగేశ్వరరావు. తెలంగాణలో మిషన్ 90పేరుతో దూకుడుమీదున్న బీజేపీకి ఖమ్మంలో పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి. అయితే ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే తెలంగాణలో బీజేపీకి సైకిల్ పార్టీ మద్దతు లభిస్తుంది. ఖమ్మం లాంటి జిల్లాలో అలయన్స్ బీజేపీకి బలంగా మారుతుంది. రెండు పార్టీలు కొన్ని సీట్లలో ప్రభావం చూపే అవకాశముంటుంది. మొత్తంగా ఖమ్మం గుమ్మం నుంచి ఎగరబోయే జెండా ఏది అనేది తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.