మన రాజకీయ పార్టీల వ్యవహారాలు భలే చిత్రంగా ఉంటాయి. తాము అధికారంలో ఉంటే తమ ప్రభుత్వం ఏం చేసినా అదుర్స్ అంటారు. అదే తాము ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ పాలన అంతా దుర్మార్గంగా ఉందంటారు. పాలనలే కాదు చివరకు రాజకీయాలు చొరబడకూడని బడ్జెట్ల విషయంలోనూ అంతే.
వారం రోజుల క్రిత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. తమ బడ్జెట్ బ్రహ్మాండమైన బడ్జెట్ అని అన్ని వర్గాల ప్రజలకూ మేలు చేసే బడ్జెట్టే అని కేంద్రంలోని బిజెపి మంత్రులు నేతలు ప్రచారం చేసుకున్నారు.
బడ్జెట్లో ఎవరైనా విశ్లేషకులు ఏదైనా తప్పు ఎత్తి చూపితే వారిపై విరుచుకు పడ్డారు కూడా. కేంద్రంలో బిజెపితో మిత్ర పక్షాలుగా ఉంటోన్న వారంతా కూడా బడ్జెట్ భేష్ అని చప్పట్లు కొట్టారు. బిజెపిని వ్యతిరేకించే కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు మాత్రం బడ్జెట్ అంతా డొల్లేనని తీసిపారేశారు. ఇంత దారుణమైన బడ్జెట్ ను తమ రాజకీయ జీవితంలోనే చూడలేదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కారు. కొంతకాలంగా బిజెపిని విమర్శిస్తూ వస్తోన్న భారత రాష్ట్ర సమితి నేతలు కేంద్ర బడ్జెట్ పై విరుచుకు పడ్డారు. తెలంగాణా రాష్ట్రాన్ని నిండా ముంచిన బడ్జెట్ అని తిట్టిపోశారు. ఒక్క తెలంగాణాయే కాదు బిజెపియేతర పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులూ చేయలేదని ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణా కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా విమర్శలు సంధించాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆరు రోజుల తర్వాత తెలంగాణాలోని బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశించింది. ఈ బడ్జెట్ ను తెలంగాణా కాంగ్రెస్ తో పాటు తెలంగాణ బిజెపి నేతలు కూడా తప్పుబట్టారు. ఇంత ప్రజావ్యతిరేక బడ్జెట్ ను తాము ఎన్నడూ చూడలేదని అన్నారు. అంటే పాలక పక్షాలకు తమ బడ్జెట్లు నచ్చుతున్నాయి. విపక్షాలకు తమ ప్రత్యర్ధుల బడ్జెట్లు ఏ మాత్రం నచ్చడం లేదు. ఈ వైఖరి ఇప్పుడే కొత్తగా మొదలైంది ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీయే అధికారంలో ఉన్నప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టినా బిజెపి పెదవి విరిచేసిది. ఇదేం బడ్జెట్ అని ఏవగించుకునేది. యూపీయే మంత్రులు మిత్రపక్షాలు మాత్రం భారత దశ దిశను మార్చేసే గొప్ప బడ్జెట్ అంటూ కొనియాడేవారు. అసలు బడ్జెట్ అనేది బ్రహ్మపదార్ధం. అది ఆర్ధిక మేథావులకు తప్ప మామూలు వారికి ఓ పట్టాన అర్ధం కాదు. ఇతరత్రా విధానాల విషయంలోనూ రాజకీయ పార్టీల వైఖరి ఇంతే ఇరుగ్గా ఉంటోంది.
యూపీయేలో ప్యాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయాలంటే బిజెపి మండి పడింది. ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ల్యాండ్ పూలింగ్ పేరిట యూపీయే ఓ చట్టం తెద్దామనుకుంటే బిజెపి గగ్గోలు పెట్టింది. ఆ తర్వాత అదే చట్టాన్ని అంతకన్నా పకడ్బందీగా అమలు చేసింది బిజెపి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విద్యార్ధులు ఏ సమస్యమీద అయినా ఆందోళనకు దిగితే విద్యార్ధులకు అసలు రాజకీయాలు ఎందుకయ్యా చదువుకోకుండా వేషాలేస్తున్నారా విద్యార్ధులకు అసలు రాజకీయాలతో పనేంటి అని తిట్టి పోశారు. అదే తాను ప్రతిపక్షానికి వచ్చినపుడు దివంగత వై.ఎస్.ఆర్. పాలనలో ఏదైనా సమస్య వస్తే విద్యార్ధులు మౌనంగా ఉంటే ఎలాగయ్యా రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి అవసరమైతే ఉద్యమాలు చేయాలి అని పిలుపు నిచ్చారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో గోధ్రా అల్లర్ల సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని దుర్భాషలాడారు. మోదీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని వాజ్ పేయ్ ని డిమాండ్ చేశారు. మోదీ హైదరాబాద్ లో అడుగు పెడితే అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే బలం లేక బిజెపితో పొత్తుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అపుడు తాను గతంలో తిట్టిపోసిన మోదీని కలిసేందుకు ఢిల్లీలో గంటల తరబడి ఓపిగ్గ నిరీక్షించారు. బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2018లో ఎన్గీయే నుండి బయటకు వచ్చి మళ్లీ నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా తిట్టిపోశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తాయేమోనని జంకారు. బహిరంగ సభల్లోనే బాహాటంగా ఆ భయాన్ని వ్యక్తం చేశారు. ఈడీ, సిబిఐ , ఐటీ బృందాల చేత నాపై దాడులు చేయించవచ్చు. అపుడు మీరే నాకు రక్షణ కవచంలా ఉండాలి అని పిలుపునిచ్చారు.
కొద్ది రోజులకే ఏపీలో సిబిఐ ఎంట్రీని నిషేధిస్తూ ఏకంగా జీవో జారీ చేశారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఇపుడు నిత్యం ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ వారిపై సిబిఐ దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కూడ కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలాగ మాట్లాడిన సందర్భాలున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పౌరుల హక్కులను అణచివేస్తోందంటోన్న కేసీయార్ తెలంగాణాలోని హైదరాబాద్ లో ధర్నా చౌక్ పై ఆంక్షలు విధించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సోషల్ మీడియా యాక్టివిస్టులపై బాబు ప్రభుత్వం కేసులు పెట్టినపుడు గగ్గోలు పెట్టారు. అదే తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టించారు. ఇలా పార్టీలు ఏవైనా అధికారంలో ఉంటే ఒక స్వరం ప్రతిపక్షంలో ఉంటే దానికి పూర్తిగా భిన్నమైన స్వరంతో రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూనే వస్తున్నారు.