తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాలంపేటలోని రామప్ప ఆలయంలో పూజలు చేసిన అనంతరం రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. రేవంత్‌రెడ్డి వెంట ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు మల్లు రవి, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. కేశపూర్, నర్సాపూర్ క్రాస్ రోడ్, బండారుపల్లి మీదుగా ములుగు వరకు యాత్ర కొనసాగింది. వడివడిగా నడుస్తూ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు రేవంత్‌రెడ్డి. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో కరచాలనం చేశారు. వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అలాగే మిర్చి చేనులో పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కూలీలతో కలిసి మిరపను తెంపారు. వారు తెచ్చుకున్న సద్ది లోంచి మహిళా రైతులు రేవంత్, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవిలకు కలిపి ముద్దలు పెట్టారు. అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేదలందరికీ ఇల్లు ఇస్తామని కూలీలకు హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భారతదేశ వ్యాప్తంగా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణ లో హాత్ సే హాత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. మొదటి రోజు ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయంలో గట్టమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత మేడారంలో సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని వనదేవతలకు నిలువెత్తు బెల్లం సమర్పించుకుని యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడారంలో వేసింది తొలి అడుగు పాదయాత్ర కోసం కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అన్నారు రేవంత్‌రెడ్డి. అయితే చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఈ యాత్రకు దూరంగా ఉన్నారు.