శిధిల దేశంలా ట‌ర్కీ. భార‌త్‌కూ భూకంప ముప్పు. డేంజ‌ర్ జోన్‌లో 50 న‌గ‌రాలు

By KTV Telugu On 8 February, 2023
image

ఆకాశ‌హ‌ర్మ్యాలు నిర్మించుకున్నా, అభివృద్ధికి ఆకాశ‌మే హ‌ద్ద‌ని చాటుకున్నా ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే మ‌నిషి చేయ‌గ‌లిగిందేమీ లేదు. ఎంత బ‌ల‌మైన పునాది వేసినా కాంక్రీట్ కొండ‌ల్ని క‌ట్టినా కాళ్ల‌కింద నేలే క‌దిలిపోయాక చేయ‌గలిగేది ఏమీ ఉండ‌దు. ట‌ర్కీ, సిరియా భూకంపంతో వ‌ణికిపోయాయి. 84 ఏళ్ల‌లో ట‌ర్కీలో ఇదే అతి పెద్ద భూకంపం. రెండు రోజుల వ్య‌వ‌ధిలో ట‌ర్కీ, సిరియాల్లో భూమి వంద‌సార్లు కంపించింది. ఒక‌టిరెండు ప్ర‌కంప‌న‌లు స‌హ‌జ‌మే కానీ ఈ భూకంపం అసాధార‌ణంగా ఉంది. ప్ర‌పంచానికి పొంచి ఉన్న ముప్పుపై ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది.

జ‌పాన్‌, ఇండోనేషియా, ఇప్పుడు పాల‌స్తీనా ప్రాంత దేశాలు. మ‌రి అత్య‌ధిక జ‌నాభాతో సువిశాల‌మైన మ‌న దేశం సేఫ్ జోన్‌లో ఉందా అంటే శాస్త్ర‌వేత్త‌లు నో అంటున్నారు. మ‌న దేశంలోనూ భూకంప కేంద్రాలున్నాయి. గ‌తంలో గుజ‌రాత్‌లో భూకంపం సృష్టించిన విల‌యాన్ని ఎవ‌రూ మ‌రిచిపోలేదు. ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే భార‌త్‌లోని చాలా న‌గ‌రాలు సుర‌క్షితం కావంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. కేంద్ర‌ప్ర‌భుత్వం, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విడుద‌ల చేసిన ఎర్త్‌క్వేక్ డిజాస్ట‌ర్ రిస్క్ ఇండెక్స్‌లో ముప్పు ఉన్న 50 న‌గరాల జాబితా బ‌య‌టికొచ్చింది. ఏపీలోని విజ‌య‌వాడతో పాటు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తావంటి న‌గ‌రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

న‌గ‌రాల్లో జ‌న‌సాంద్ర‌త‌, గృహ‌నిర్మాణాల‌ను ఆధారంచేసుకుని హైద‌రాబాద్ ఐఐఐటీ విద్యార్థులు భూకంప ప్ర‌మాదం ఉన్న ప్రాంతాల‌పై అంచ‌నాకొచ్చారు. వారు గుర్తించిన 50 న‌గ‌రాల్లో 13 అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఉన్నాయి. 40మ‌ధ్య‌స్థ ప్ర‌మాద న‌గ‌రాలైతే, మిగిలిన ఏడు న‌గ‌రాల్లో భూకంప ప్ర‌మాదం త‌క్కువ‌గానే ఉంది. విజ‌యవాడ న‌గ‌రం అధిక ప్ర‌మాదం ఉన్న జోన్‌లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌క‌తా, చెన్నై, అహ్మదాబాద్, చండీగ‌ఢ్‌, డార్జిలింగ్‌, సిలిగురి నగరాలు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నాయి. ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని ఎప్ప‌ట్నించో అంటున్నారు. కానీ భూమండ‌లం ఇంకా సుర‌క్షితంగానే ఉంది. అంచ‌నాల‌న్నీ నిజం కాక‌పోవ‌చ్చుగానీ శాస్త్రీయ అధ్య‌య‌నాన్ని తేలిగ్గా తీసుకోకూడ‌దు. నిర్మాణాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఏదైనా అనుకోని విప‌త్తు ముంచుకొస్తే ప్రాణ‌న‌ష్టాన్ని నివారించేందుకు ముంద‌స్తు చ‌ర్య‌లు ఉండాలి. వ‌చ్చిన‌ప్పుడు చూసుకోవడానికి ఏమీ ఉండ‌దు. ట‌ర్కీ, సిరియా వైప‌రీత్యం క‌ళ్లెదుట క‌నిపిస్తోంది. మ‌న భ‌ద్ర‌త మ‌న చేతుల్లోనే ఉంది.