సొమ్ము “మిడిల్ క్లాస్”ది – పథకాలు ఓటు బ్యాంక్‌కు

By KTV Telugu On 8 February, 2023
image

రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను తమ బ్రాండ్లుగా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. ప్రజలు పన్నులుగా కట్టే సొమ్మును తమ పేరు మీద ఓటు బ్యాంక్‌కు పంచుతూ ఉంటాయి. ఇలా పంచే సొమ్ము దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే అందుతుంది. మరి ఈ పన్నులు కట్టేది ఎవరు ధనవంతులు మధ్యతరగతి ప్రజలు. ధనవంతులు ఎంత మంది ఉన్నారు ఒక్క శాతం ధనవంతులు కూడా ఉండరు. అత్యధిక శాతం మధ్యతరగతి ప్రజలే. అంటే మధ్యతరగతి తాము కష్టపడి తాము బతుకూ నిరుపేదల్ని కూడా బతికిస్తున్నారన్నారట. వారి నుంచి పన్నులు పిండి ప్రభుత్వాలు ఏ పనీ పాటా లేకుండా ఉన్న వారికి పంపిణీ చేస్తున్నాయి. ఈ విషయం చాలు మధ్య తరగతి ప్రజలు నిలువుదోపిడికి గురవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు అర్హులుగా పేరు పడిన వారి జీవన ప్రమాణాల ప్రకారం వారి జీవితం నడిచిపోతోంది. సమాజంలో ధనవంతులు కూడా తమ తమ పరిధిలో భాగున్నారు. అందరూ పలుకుబడి కలిగిన వారు కావడంతో ప్రభుత్వాలతో పనులు చేయించుకుని బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టి అయినా తమ రాయల్టీ తగ్గకుండా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఎటూ తిరిగి మధ్యతరగతి ప్రజలకే పెద్ద గండం వచ్చి పడింది. మధ్యతరగతి ప్రజలు నెలవారీ ఖర్చులకు జీతభత్యాలు వ్యాపార ఆదాయం సరిపోని పరిస్థితి. చిరు వ్యాపారులు ఓ మాదిరి వ్యాపారాలు చేసేవారు అరకొరజీతంతో పని చేసే ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కువగా రుణాలు కట్టలేక డిఫాల్ట్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలకు రూ.లక్ష కోట్ల వరకూ మధ్యతరగతి ప్రజలు తీసుకున్న క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించడం లేదన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.

మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపైనే పన్నుల భారాన్ని మోపుతోంది. మూడు లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే పన్నులు వసూలు చేస్తోంది. ఆ తర్వాత ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇక రాష్ట్రాలు స్థానిక సంస్థలు ఇలా వరుసగా పన్నుల బాదుడుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వాల నిర్వాకంతో ఆదాయం కోల్పోయిన మధ్యతరగతి ప్రజలు అదే ప్రభుత్వాలు పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తూండటంతో ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాడు. కరోనా అనంతర పరిస్థితుల్లో 3.2 కోట్ల మధ్యతరగతి కుటుంబాలు దిగువకు పడిపోయాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లేక నిరుపేదలుగా మారారు. కరోనా సంక్షోభం రాకముందు 9.9 కోట్ల మంది ఉండే మధ్య ఆదాయ వర్గం ఆ తర్వాత ఏడాది కాలంలోనే 6.6 కోట్లకు తగ్గిపోయింది. అయినా వీరు మధ్యతరగతి పేరుతో ప్రభుత్వాలను పోషించడానికి కష్టపడాల్సి వస్తోంది.

అత్యంత నిరుపేదలను ప్రభుత్వాలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాయి. అత్యంత ధనికులు రాజకీయ పార్టీల ఆర్థిక అవసరాలకు ఖజానాలాగా ఉపయోగపడుతూ తమ ఖజానాను నింపుకుంటున్నాయి. కానీ మధ్య తరగతి జీవులు మాత్రమే ఎటూ కాకుండా పోయారు. ఇరవై నాలుగు గంటలు కష్టపడటం వారి సంపాదన నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడం తప్ప వారికి మరో వ్యాపకం లేకుండా పోయింది. ఓ మాదిరి సంపాదన పరుడైతే చాలు ప్రభుత్వానికి పండగే. పని చేసుకున్నందుకు పన్ను దగ్గర్నుంచి సంపాదించుకునేవరకూ పన్నులు వసూలుచేస్తున్నారు. ఇంత చేసినా వారి పట్ల ప్రభుత్వాల కనీస బాధ్యతగా ప్రవర్తిస్తున్నాయా అన్నది సందేహం. అలాంటి బాధ్యత ఉంటే నిత్యావసర వస్తువల ధరలను అయినా అందుబాటులో ఉంచేవారు. కనీసం ఉంచడానికి ప్రయత్నించేవారు. కానీ పెట్రోల్ డీజిల్ నుంచి ఏడాదికి రూ. మూడు లక్షల కోట్లను పిండుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు వాటి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జీవనం భారం అవుతుందనే ఆలోచనను మాత్రం చేయడం లేదు.

ఇప్పుడు అయితే ధనవంతుడిగా ఉండాలి లేకపోతే నిరుపేదగా ఉండి ప్రభుత్వ పథకాలు తీసుకుని కాలు మీద కాలు వేసుకుని బతకాలి అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు అన్ని చోట్లా అలాంటి పరిస్థితే ఉంది. ఇది మారాలంటే రాజకీయ వ్యవస్థ మారాల్సిందే.