ఏపీలో ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నేతల జంపింగ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి, ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేసి సైకిల్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి కొందరు నేతలు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ సీట్ల ఖరారు పై కొందరు సీనియర్లలో టెన్షన్ మొదలైంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం ఇంఛార్జ్ లను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలతో అలిగిన కొందరు తమ్ముళ్లు గోడ దూకే ఆలోచన చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాలుగు నియోజకవర్గాలకు కొంత ఇంచార్జ్లను నియమించారు. నెల్లిమర్లలో సీనియర్ నేతను కాదని కొత్త వారికి బాబు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అక్కడ అసంతృప్తి రాజ్యమేలుతోంది. ఇక తునిలో ఏకంగా ఆ పార్టీ నేతతో వైసీపీ నేతలు మంతనాలు సాగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా తుని నియోజకవర్గం టీడీపీలో యనమల కుటుంబలో సీటు కోసం పోటీ మొదలైంది. తుని నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్థానంలో గత రెండు ఎన్నికల్లోనూ ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తుని ఇంఛార్జ్ గా తన కుమార్తె కోసం యనమల ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచి సోదరుడి అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇదే అంశం పైన కృష్ణుడు నియోజకవర్గ పార్టీ నేతలతో జరిపిన ఫోన్ సంభాషణలు వైరల్ అయ్యాయి. తాజాగా తుని ఇంఛార్జ్ గా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను నియమిస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణుడు తన మద్దతు దారులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కృష్ణుడికి టచ్లోకి వెళ్లిన వైసీపీ నేతలు అతనికి పలు ఆఫర్లు ఇస్తున్నారట.
ప్రస్తుతం తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజా చేతిలోనే రెండు సార్లు కృష్ణుడు ఓడిపోయారు. అయినప్పటికీ సీనియర్ నేత యనమల సోదరుడు కావటం కీలక జిల్లా సామాజిక వర్గాల పరంగానూ ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వైసీపీ ముఖ్యులు రంగంలోకి దిగారు. యనమల కృష్ణుడు వైసీపీలో చేరితే ప్రస్తుతానికి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించేందుకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సమయంలో వీలైతే ఎమ్మెల్యే సీటు లేకుంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారట. ఈ నెల 16న చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో చంద్రబాబును కలిసి తనకు జరిగిన అన్యాయం పైన చర్చించాలని తొలుత కృష్ణుడు భావించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఇచ్చిన ఆఫర్ తో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ నేతలు కృష్ణుడు వైసీపీలోకి వెళ్లకుండా వారించేందుకు చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. కృష్ణుడు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే విషయం తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నేతలతో ఆయన స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కృష్ణుడుని తన దగ్గరకు తీసుకొని రావాలని మాజీ ఎమ్మెల్యేలు వర్మ వరుపుల రాజాకు సూచించారట. వైసీపీ నేతల హామీతో అధికార పార్టీ కండువా కప్పుకొనేందుకు కృష్ణుడు సిద్దమయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కృష్ణుడిని పార్టీ మారకుండా టీడీపీ కట్టడి చేస్తుందా. యనమల సోదరుడి నిర్ణయం ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తి కరంగా మారింది.