జాతీయ చిహ్నానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి.. విపక్షాలు చేస్తున్న ఆరోపణలేమిటి.. ప్రభుత్వపక్షం సమర్థించుకోవడం సహేతుకమేనా… జాతీయ చిహ్నంపై వస్తున్న విభిన్న అభిప్రాయాలేమిటి…
స్వాతంత్ర ఉద్యమకాలం నాటి పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరే అవకాశం ఉండటంతో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ దిశగా జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మను ప్రధాని మోదీ ఇటీవల ఆవిష్కరించారు. వెంటనే దానిపై వివాదం చెలరేగింది. దేశ కార్యనిర్వాహక అధినేత అయిన మోదీ.. ఇలాంటి తప్పు ఎందుకు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంటు భవనంపై ఉన్న సింహాల బొమ్మలు రౌద్రంగా కనిపిస్తున్నాయని విపక్షాలు అంటున్నాయి. జాతీయ చిహ్నంలోని సింహాలు కేవలం చిన్నగా గర్జిస్తున్నట్లుగా ఉండగా.. కొత్తగా ఆవిష్కరించిన విగ్రహంలోని సింహాలు మానవులను తినే ధోరణిలో కనిపిస్తున్నాయని రాష్ట్రీయ జనతాదళ్ ట్వీట్ చేసింది. ప్రధాని అమృతకాల్ వ్యాఖ్యను విమర్శిస్తూ.. సాధారణంగా జాతీయ చిహ్నంలోని సింహాలు తేలికపాటి గర్జనతో ఉండగా.. అమృతకాలంలో ఆవిష్కరించినవన్నీ కూడా మానవులను తినేసే ధోరణిలో ఉంటాయని ఆర్‌జెడి ఎద్దేవా చేసింది. పాత చిహ్నంలో మానవుని ఆలోచనను చూపుతుండగా, కొత్త చిహ్నం మనిషి నిజమైన స్వభావాన్ని తెలుపుతున్నాయని విమర్శించింది. ఇక బీజేపీ ప్రభుత్వం సామ్రాట్ అశోకుడినే అవమానించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వ పక్షం అంటోంది. అశోకుడి కాలంలో సింహాల బొమ్మకు ఇప్పుడు తాము రూపొందించిన చిహ్నాలకు పెద్ద తేడా లేదని… ఇప్పటి బొమ్మ చాలా పెద్దదిగా ఉన్నందువల్ల అలా కనిపిస్తుందని చిహ్నం రూపకర్తలు సునీల్ డియోర్, రోమియోల్ మోసెస్ వాదిస్తున్నారు. అంతే తప్ప చిహ్నంలో పెద్ద మార్పు లేదని, ఈ శిల్పం కళాకారులుగా తాము గర్వపడుతున్నామని అన్నారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఎదురుదాడి చేస్తున్నారు. విపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. సారనాథ్ ఎంబ్లెమ్‌నూ కింది నుంచి చూస్తే శాంతంగా కనిపిస్తాయా? కోపంగా కనిపిస్తాయా? అని ప్రశ్నించారు. సారనాథ్‌లోని ఎంబ్లెమ్ ఎత్తు 1.6 మీటర్లు అని, కొత్త పార్లమెంటు భవనంపైని చిహ్నం 6.5 మీటర్ల ఎత్తు ఉన్నదని వివరించారు. కింద నుంచి చూడటం వల్లే కొందరికి రౌద్రంగా కనిపిస్తున్నాయని తప్పితే అందులో తేడా లేదని ఆయన అంటున్నారు…
డిసెంబర్ 10, 2020న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ భవనంలో ఉన్న లోక్‌సభలో 888 మంది ఎంపీలకు, రాజ్యసభలో 384 మంది ఎంపీలు కూర్చేనే వీలుంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్ విభజన జరిగి…. ఎంపీల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 11న నూతన పార్లమెంట్ భవన పనులను పరిశీలించారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి జరుగుతున్న పనులపై మోదీ ఆరా తీశారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు జరుగుతున్న నిర్మాణాలు, సుందరీకరణ పనులను మోదీ పరిశీలించారు. అప్పుడు జాతీయ చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఆ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వం వైపు నుంచి వివరణ వచ్చినా… విపక్షాల ఆరోపణలు ఆగడం లేదు. పార్లమెంట్, జాతీయ చిహ్నమని దేశ ప్రజల కోసమని, కేవలం ఒక్కరికే సొంతం కాదని కాంగ్రెస్ అంటోంది. రాజ్యాంగ పరమైన అధికారాల విభజనను ఎగ్జిక్యూటివ్ హెడ్ తారుమారు చేశారని సిపిఎం వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ అన్ని రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అయితే విపక్షాల ఏడుపు ఏమిటో తమకు తెలుసని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదన్న అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అంటోంది. ఏదేమైనా.. కొంత కాలం ఈ ఆరోపణలు సాగుతాయి. తర్వాత సమసిపోతాయన్నది నిజం..