ముగ్గురు మంత్రులను శభాష్‌ అని మెచ్చుకున్న సీఎం జగన్‌

By KTV Telugu On 8 February, 2023
image

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటయ్యే పలు ప్రాజెక్టులు, సంస్థలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో మండలాల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు కూడా ఆమోదం తెలిపింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎనర్జీ పార్కు ఏర్పాటుకు రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 61వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.

వైజాగ్ లో టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చాలని నిర్ణయించింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కేబినెట్ అంగీకారం తెలిపింది. యూనిట్టుకు రూ. 2 చొప్పున రాయితీ ఇవ్వాలనీ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా తాడేపల్లి గూడెం లో రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 500 మెగావాట్ల ఆదాని హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు 406 ఎకరాలు ఎకరాకు 5 లక్షల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 106 కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. రాష్ట్రంలో పలు మండలాల్ని అర్బన్, రూరల్ గా విభజించేందుకు రాష్ట్ర కేబినెట్ ఇవాళ అనుమతి ఇచ్చింది.

ఈ నెల 10 నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేయాలని నిర్ణయించింది. వివిధ శాఖల సమీక్ష సందర్భంగా ముగ్గురు మంత్రుల పనితీరును సీఎం జగన్ మెచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్యశాఖ మంత్రి విడదల రజనీతో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ప్రశంసించారు. ఇటీవల మృతిచెందిన కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ కేబినెట్ మౌనం పాటించింది.