అదానీ.. అదానీ .. అదానీ వారం పది రోజులుగా దేశం మొత్తం హోరెత్తిపోతున్న పేరు ఇది. ఇండియన్ స్టాక్ మార్కెట్ వేదికగా ఆయన సంపద ఎంత వేగంగా ప్రపంచ కుబేరుని స్థాయికి ఎదిగారో అంతే వేగంగా పడిపోయారు. ఈ అంశంపై ప్రజల్లో ఎన్నో సందేహాలు. మార్కెట్ నిపుణులు లెక్కలేనన్ని ప్రశ్నలు ప్రభుత్వాలకు రెగ్యూలేటరీ సంస్థలకు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా అనేక ప్రశ్నలు వేశారు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో స్పీచ్ వైరల్ అయింది. ఇవన్నీ చూసిన వారికి ప్రధాని మోదీ అన్నింటికీ తనదైన శైలిలో సమాధానం ఇస్తారనుకున్నారు. ఉత్కంఠకు గురయ్యారు. ఊపిరి బిగబట్టి చూశారు. కానీ ఆయన అదానీ పేరు ఎత్త లేదు. అదానీ పేరు ఎత్తకుండా ఆ అంశం గురించి ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఓ రక్షణ కవచం తెచ్చుకున్నారు. కరోనా వైరస్‌కు కోవిషీల్డ్ లాగా తనకు విపక్షాలు చేస్తున్న ఆరోపణల నుంచి రక్షించడానికి 140 కోట్ల మంది ప్రజల విశ్వాసం షీల్డ్ గా ఉందని ఆయన ప్రకటించేశారు. ప్రజల అభిమానం ఉందా లేదా అన్న సంగతి తర్వాత.. ముందు లేవనెత్తిన ప్రశ్నకు గౌరవనీయ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలా వద్దా అన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం.
ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్ సంపద రూ. పది లక్షల కోట్లు హరించుకుపోయింది. దీనికి కారణం అదానీ. అదానీ కంపెనీల పెట్టుబడులు షేర్ల పతనంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇది ఏ మాత్రం తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో ప్రమాదకరమన్న వాదన బలంగా ఉంది. అందుకే దేశ అత్యున్నత చట్ట సభలో చర్చ చేపట్టాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. అదానీపై కుట్ర భారత్ పై జరుగుతున్న కుట్రని అక్రమాల్లేవంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. ఆర్బీఐ ఎల్ఐసీ అప్పులిచ్చిన బ్యాంకులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయి. నిజానికి అలాంటి కుట్రలను ప్రభుత్వమే బట్టబయలు చేయాల్సి ఉంటుంది. అటు ప్రజల సందేహాలు తీర్చాలన్నా ఇటు భారత్ పై కుట్ర జరిగినా పార్లమెంటులో చర్చిస్తే ప్రజల ముందు పెట్టినట్లవుతుంది. కానీ అసలు అదానీ అనే మాటనే ప్రస్తావించడానికి కేంద్రం సిద్ధపడటం లేదు.
అదానీ కంపెనీల్లో భారత ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ ఎల్ఐసి వేల కోట్ల రూపాయలు పెట్టింది. ప్రపంచంలోనే అగ్రగామి బ్యాంకుల్లో ఒకటైన ప్రభుత్వ రంగ ఎస్బిఐ వేలాది కోట్ల రూపాయల రుణాలిచ్చింది. అదానీ కంపెనీల షేర్ల పతనంతో ఆ ప్రభుత్వరంగ సంస్థలేమవుతాయో తమ సొమ్ము దక్కుతుందో లేదోనని కోట్లాదిమంది పాలసీ హోల్డర్లు డిపాజిటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారందరికీ వాస్తవాలు వివరించి అవసరమైన భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు చూపడం పార్లమెంటు కర్తవ్యం. అది మానేసి రక్షణ కవచం అడ్డు పెట్టుకుని ప్రసంగించారు ప్రధాని మోదీ. ఎప్పట్లాగే ప్రధాని మోదీ విపక్షాలు దేశం అభివృద్ధి చెందుతూంటే అసూయ పడుతున్నట్లుగా ప్రకటించారు. అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ లో అద్భుతమైన స్వేచ్చ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న చాలా విజయాల గురించి చెప్పారు. ఈ క్రమంలో విపక్షాలపై సెటైర్లు వేశారు. విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అక్రమాలకు పాల్పడటం వల్లనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది. రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతులు వంట నూనెల మొదలు విద్యుత్ రంగం వరకూ దేశంలోని అన్ని రంగాల్లో అదానీ ఎలా పాతుకుపోయారన్నది తెలియాల్సి ఉంది. రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేకపోయినా నాలుగు డిఫెన్స్ కాంట్రాక్టులను పొందారు. శ్రీలంకలో ఇంధన కాంట్రాక్టులు బంగ్లాదేశ్‌లో విద్యుత్ కాంట్రాక్టులుఇలా ఒకటేమిటి అన్నీ అదానీకి వచ్చేలా ప్రధాని కార్యాలయమే మంత్రాంగం నెరిపిందన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. స్టాక్ మార్కెట్ కుంభకోణాలు ఇతర భారీ అక్రమాలు వెల్లడైన సందర్భాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీలు నియమించిన చరిత్ర మన దేశానికి ఉంది. ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అదానీ వ్యవహారంపై ఇప్పటికైనా జెపిసి నియామకానికి కాదు కదా చర్చించడానికి కూడా సిద్ధంగా లేదు. అందుకే ప్రజల్లో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక మోదీ చెప్పినట్లుగా నిజంగా ఆయనకు 140 కోట్ల మంది అభిమానం రక్షణషీల్డ్ గా ఉందా అంటే ఇక ప్రశ్నలు ఎవరు సంధిస్తున్నారని మనం ప్రశ్నించుకోక తప్పదు. ఓట్లు వేసేవారే ఫ్యాన్స్ అనుకుంటే దేశంలో మెజార్టీ ప్రజలు మోదీకి వ్యతిరేకకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 37 శాతం. అంటే అరవై మూడు శాతం బీజేపీ ఓట్లు వేయలేదు. ఇతర పార్టీలకు ఓట్లు వేశారు. మరి వీరంతా మోదీ అడ్డం పెట్టుకున్న షీల్డ్‌లో భాగమేనా అన్నది ప్రధాన సందేహం. మొత్తంగా ప్రధాని మోదీ అసలు కారణాలు చెప్పకుండా రాజకీయంగా ప్రజల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అదానీ విషయంలో ఆయన తీరుపై అనేక అనుమానాలు పెరగడానికి కారణం అవుతున్నారు.