“పవర్” మంత్రి జగదీష్ రెడ్డి పవర్ ఎంత.. ఆయనకెన్ని మార్కులు

By KTV Telugu On 9 February, 2023
image

ఓ ప్రభుత్వం విజయవంతం అయిందంటే ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికే దక్కవచ్చు కానీ అందులో కృషి మాత్రం మంత్రి వర్గ సభ్యులకూ ఉంటుంది. ఇదే ఫార్ములా ఫెయిల్యూర్‌కూ వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మూడో సారి ప్రజాభిప్రాయం కోసం ప్రజా తీర్పు కోసం ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో కేసీఆర్ టీమ్‌లో మంత్రుల పని తీరు ప్రజల్లో చర్చకు వస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో ముఖ్యమైన మంత్రుల్లో గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఒకరు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్న నాయకుడు. ఆ తర్వాత కూడా కేసీఆర్ చెప్పిన మాట జవదాటకుండా అటు మంత్రి పదవి ఇటు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండో సారి కేబినెట్‌లో ఆయన విద్యుత్ మంత్రిగా ఉన్నారు. గుంతకండ్ల జగదీష్ రెడ్డి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా. ప్రజా సేవలో తరించారా. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశారా. ఆయనకు ఎన్నిమార్కులు వేయవచ్చు..?

దేశం మొత్తం కరెంట్ కొరత ఉంది. దేశంలో ఎక్కడైనా కరెంట్ ఉంటే వార్త తెలంగాణలో పోతే వార్త అని తెలంగాణలో విద్యుత్ సమస్య లేకపోవడంపై సీఎం కేసీఆర్ గొప్పగా చెబుతూంటారు. నిజంగానే గత ఏడాది దేశం మొత్తం విద్యుత్ కొరత ఏర్పడి పవర్ హాలీడేలు ప్రకటించుకున్న సమయంలో తెలంగాణలో ప్రజలు ఏసీలు ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. విద్యుత్ ను కొనుగోలు చేశారా ఉత్పత్తి చేశారా అన్న అంశాలు ప్రజలకు అనవసరం. అవసరం అయితే ప్రభుత్వ తీర్చేసింది. ఇదే వారికి కావాల్సింది. ఈ విషయంలో ఎనర్జీ మంత్రిగా గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి పని తీరుకు ఆయనకు ఫస్ట్ క్లాస్ మార్కులు ఇవ్వొచ్చు. తెలంగాణ ప్రభుత్వంలో విద్యుత్ విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది. తన శాఖ విషయంలో ఎప్పుడూ ఏమీ చేయలేదని కనీసం సమీక్షలు కూడా చేయరని అంతా కేసీఆరే చూసుకుంటారన్న ప్రచారం ఉన్నా సాంకేతికంగా అధికారికంగా విద్యుత్ శాఖకు జగదీష్ రెడ్డినే బాధ్యత వహిస్తారు కాబట్టి విజయాన్ని కూడా ఆయన ఖాతాలో వేయాలి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు అందబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ అవసరం మరింత పెరుగుతుందని అంచనా వేసి దానికి తగ్గట్లుగా భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు వేశారు. చాలా వరకూ ముందుకు సాగుతున్నాయి. త్వరలో యాదాద్రి విద్యుత్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ విద్యుత్ విషయంలో స్వావలంబన సాధించడానికి అవకాశం ఉంది. బయట నుంచి కొనాల్సిన పరిస్థితి తగ్గిపోవచ్చు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పురోగమించిందని అనుకోవచ్చు.

అయితే విద్యుత్ మంత్రిగా జగదీష్ రెడ్డికి నేరుగా ప్రజలతో సంబంధం ఉండదు. కరెంట్ బిల్లు కరెంట్ కనెక్షన్లు ఇతర వినియోగ సంబధిత అంశాలు ఇతర శాఖల్లోలా మంత్రి వరకూ రావు. దీనికి కారణం అటు జెన్ కో ట్రాన్స్ కో ప్రత్యేక కార్పొరేషన్లుగా ఉండటంతో పాటు వాటికో ప్రత్యేకవ్యవస్థ ఉంటుంది. ఈ కారణంగా జగదీష్ రెడ్డి మంత్రిగా ప్రజలకు సేవ చేసే విషయంలో తన శాఖ పరంగా చూస్తే ప్రజల్లో ఆయనకు ఎలాంటి గుర్తింపు ఉండదు. చాలా మందికి ఆయన శాఖ ఏమిటో కూడా గుర్తు ఉండదు. కానీ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన నేతగా మంత్రిగా పవర్ ఆయన చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ వస్తున్నారు. వీలైనంత వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. మంత్రిగా ఆయన పని తీరుకు ఫస్ట్ క్లాస్ మార్కులు అంటే అరవై శాతం వరకూ వేయవచ్చు.

ఇక మంత్రిగా పార్టీ కోసం ఎంత బాగా పని చేశారన్నది కూడా కీలకమే. తెలంగాణలో మంత్రి పదవులు చేపట్టిన వారిలో ఎక్కువగా అధికార విధుల్లో కన్నా పార్టీ పనుల్లోనే ఎక్కువగా ఉంటారు. అలాంటి మంత్రుల్లో జగదీష్ రెడ్డి కూడా ఒకరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో రెండు తప్ప అన్నిగెల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు అయిన హుజూర్ నగర్, మునుగోడులకు వచ్చిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల బాధ్యతలు తీసుకుంది జిల్లా మంత్రి అయిన జగదీష్ రెడ్డినే. రెండు చోట్ల తనదైన శైరిలో ఆయన రాజకీయ వ్యూహాలను రచించి పార్టీని బలోపేతం చేశారు. విజయాలు దక్కించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ కొట్టలేరని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పరిస్థితిని మార్చి బీఆర్ఎస్‌ కంచుకోటగా మార్చడంలో గుంతకండ్ల జగదీష్ రెడ్డి తనదైన శైలిలో ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు.

ఎనిమిదేళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నందున ఆయన తీరుపై సహజంగానే ప్రజల్లో కొన్ని సందేహాలు అనుమానాలు వస్తాయి. ఆయన అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలూ ఎక్కువగానే ఉన్నాయి. కలెక్టరేట్ స్థలాల ఎంపికలో ఇతర విషయాల్లోనూ విమర్శలు ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు అదీకూడా పవర్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజంగానే వస్తాయి. దీనికి జగదీష్ రెడ్డి కూడా అతీతుడేం కాదు కానీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయేంత తీవ్రమైన ఆరోపణలు ఆయన ఎదుర్కోవడంలేదు. ఎలా చూసినా తెలంగాణ కేబినెట్ మంత్రుల్లో అటు తన శాఖలో ఇటు రాజకీయ పరంగా కూడా జగదీష్ రెడ్డి అరవై శాతం మార్కులు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు.