2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని కానియ్యను కానియ్యను కానియ్యను అని మూడు సార్లు గట్టిగా నొక్కి వక్కాణించారు పవన్ కళ్యాణ్. ఇది నా శాసనం రాసిపెట్టుకోండి అని కూడా ధీమాగా అన్నారు. అయితే ఆయన అంచనా ఎక్కడో తప్పేసింది. ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు. జగన్ ను ఓడించి తీరతానన్న పవన్ కళ్యాణ్ మాత్రం తాను పోటీచేసిన భీమవరం, గాజువాక నియోజక వర్గాలు రెండింటిలోనూ ఓటమి చెందారు. ఆ తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేకపోయినా కేంద్రంలోని బిజెపి తో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించారు పవన్. అంతకు ముందు ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న పవన్ కామ్రేడ్లకు గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకన్నారు. అప్పట్నుంచీ అడపా దడపా హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ వచ్చారు. మతమార్పిళ్లపైనా నిప్పులు చెరిగిన పవన్ దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసేస్తున్నారంటూ టిడిపి బిజెపిలతో కలిసి నానా రగడ సృష్టించారు.
బిజెపితో అంతగా మమేకం అయిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన తరపున గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన్ను ముఖ్యమంత్రిగానే చూడాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిజెపితో పవన్ పొత్తు పెట్టుకోవడంతో తమ ఆకాంక్ష ఏదో ఒక రోజు నెరవేరుతుందన్న ఆశతోనూ ఉన్నారు. కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ టిడిపికి బాగా దగ్గరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవాలంటే టిడిపి-జనసేనలు విడివిడిగా పోటీ చేస్తే వీరమరణాలు పొందక తప్పదని ఆయనే వ్యాఖ్యానించారు. అందుకే టిడిపితో పొత్తు పెట్టుకోక తప్పదని కార్యకర్తలకు అర్ధమయ్యేలా చెప్పుకొచ్చారు. అయితే బిజెపితో పొత్తులో ఉన్న పవన్ బిజెపి కన్నా టిడిపితో ఎక్కువ సన్నిహితంగా ఉండడంతో ఏపీ బిజెపి నేతలు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఒక పక్క బిజెపి కేంద్ర నాయకత్వం టిడిపితో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బల్లగుద్ది చెప్పేసింది. పవన్ మాత్రం బిజెపి టిడిపి జనసేనలు మూడూ కలిసి పోటీ చేయాలని భావించారు.
ఈ క్రమంలో పవన్ వైఖరిని చూసి విసుగు చెందిన ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజరు తాజాగా ఓ వ్యాఖ్య చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటుందని అన్నారు. ఒక వేళ జనసేన కలిసొస్తే దానితో కూడా పొత్తు పెట్టుకుంటామని అన్నారు. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఆషామాషీగా చేసినవి కావంటున్నారు రాజకీయ పరిశీలకులు. బిజెపి జాతీయ నాయకత్వం సూచనల మేరకే సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలంఉ చేసి ఉంటారని వారంటున్నారు. ఏపీ బిజెపిలో పవన్ తో పొత్తు ఉండి తీరాలని తహతహలాడే నేతల్లో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యులు. సోము వీర్రాజు కీ జనసేనతో పొత్తు ఇష్టమే అయినా టిడిపితో కూడా కలిసి ముందుకు వెళ్లడం ఆయనకూ ఇష్టం లేదంటున్నారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని అర్ధం వచ్చేలా జనంతోనే మా పొత్తు అని వ్యాఖ్యానించి ఉండచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
ఏపీలో బిజెపికి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. ఏపీలో బిజెపి ఎదక్కపోడానికి చంద్రబాబు నాయుడే కారణమని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే బాబును పక్కన పెట్టాలని కృత నిశ్చయంతో ఉంది. అయితే పవన్ మాత్రం చంద్రబాబు తో కలిసి నడిస్తేనే తనకు రాజకీయంగా లాభమని అంచనాలు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కమలానికి దూరం దూరం జరుగుతోంటే పవన్ కు దగ్గరయ్యేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తహతహ లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పైనా ఆ మాటకొస్తే మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్య చేసే బాలయ్య కూడా తన అన్ స్టాపబుల్ షోలో పవన్ ను ప్రేమించేశారు. పవన్ పై వస్తోన్న మూడు పెళ్లిల్ల వివాదానికి అన్ స్టాపబుల్ వేదికమీదే ప్రత్యర్ధులకు సమాధానం చెప్పించి పవన్ ను మెప్పించే ప్రయత్నం చేశారు బాలయ్య. ఈ ఇద్దరి వ్యవహారం అన్ స్టాపబుల్ షో రక్తి కట్టించడానికి ఉపయోగపడుతుంది కానీ టిడిపి-జనసేన పార్టీలకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందా అంటే డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.