నాగ్‌పూర్ టెస్టులో తెలంగాణ, ఏపీ ప్లేయర్లు

By KTV Telugu On 9 February, 2023
image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు లభించడం విశేషం. తెలంగాణ నుంచి మహ్మద్ సిరాజ్ ఆడుతుంటగా ఏపీకి చెందిన మరో తెలుగు తేజం భరత్ అరంగేట్రం చేశాడు. వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా నుంచి టెస్టు క్యాప్ అందుకున్నాడు ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. టీమిండియా కీపర్ రిషభ్ పంత్ యాక్సిడెంట్‌ కారణంగా దూరం కావడంతో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లలో ఒకరు అరంగేట్రం చేయడం గ్యారంటీ అయింది. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో కేఎస్ భరత్‌కు టీం మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. ఇప్పటికే మహ్మద్ సిరాజ్ ఇటీవల సిరీస్‌లలో తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు భరత్ కూడా సక్సెస్ కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.

టీమిండియాలో చోటు సంపాదించిన భరత్‌కు ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో భరత్ ఫొటో షేర్ చేసిన జగన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మనలో ఒకడైన కోన భరత్ భారత క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అతనికి నా బెస్ట్ విషెస్. తెలుగు జెండా ఉన్నతంగా ఎగురుతూనే ఉంది’ అని ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోన భరత్ అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసి చాలా సంతోషంగా ఉంది. దేశం గర్వించేలా అతను సత్తా చాటే క్షణం కోసం ఎదురు చూస్తూ అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నా అని చంద్రబాబు ట్వీట్ చేశారు. భారత్‌కు అతను సుదీర్ఘకాలం విజయవంతంగా సేవలు అందించాలని కోరుకుంటున్నానంటూ లోకేష్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసిస్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. మొదటి నుంచి పిచ్ గురించి ఆసిస్ ప్లేయర్లు మాజీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారు భయపడినట్టే జరిగింది. స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ల దెబ్బకు కంగారులు కంగారుపడిపోయారు. జడేజా ఐదువికెట్లు తీసి ఆసిస్ నడ్డివిరిచేయగా అశ్విన్ తనకు అచ్చొచ్చిన పిచ్‌పై మూడు వికెట్లతో రాణించాడు. సిరాజ్, షమీలు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసిస్ బ్యాట్స్‌ మెన్లలో ముగ్గురు డకౌట్ కాగా మరో ముగ్గూరు ఖాతా తెరిచిన వెంటనే పెవిలియన్ బాట పట్టారు.