సీబీఐ సీరియస్‌గా తీసుకుంటే ఆరేడునెలల్లో తేలిపోవాల్సిన కేసు. కానీ సీబీఐకే అంతుపట్టటంలేదో ఈ కేసుని దర్యాప్తు సంస్థ త్వరగా తెమల్చాలని అనుకోవడంలేదోగానీ జీడిపాకంలా సాగుతూనే ఉంది. కార్తీకదీపం సీరియల్‌కైనా చివరికి శుభం కార్డు పడిందిగానీ సీబీఐ ఎంక్వయిరీ ఎప్పుడు ముగుస్తుందో తెలీడంలేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సస్పెన్స్ ఏమాత్రం తగ్గకుండా చూస్తోంది సీబీఐ.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవడం ఓ సంచలనం. ఆయనతో పాటు ఆయన తండ్రి పాత్రపై సీబీఐకి అనుమానాలు ఉన్నాయి. అంతకుముందు అప్రూవర్ దస్తగిరితో పాటు ఆరేడు మంది పేర్లు తెరపైకొచ్చాయి. అవినాష్‌రెడ్డి విచారణ తర్వాత మరికొందరిని అనుమానితులుగా చేర్చింది సీబీఐ. ఆయన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా జగన్ సతీమణి భారతి ఇంట్లో పనిచేసే నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను విచారించింది. నవీన్ నెంబర్‌కు అవినాష్ ఎక్కువ కాల్స్ చేసినట్లు సీబీఐ గుర్తించింది.
వైఎస్ వివేకా కూతురు సునీత న్యాయపోరాటంతో సీబీఐ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లే కనిపిస్తున్నా కేసు కొలిక్కిరావడం లేదు. ఎప్పటిలోపు తేలుతుందో సీబీఐ కూడా చెప్పలేకపోతోంది. సునీత విన్నపంతో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ ఏపీనుంచి తెలంగాణకు మారింది. తర్వాత సీబీఐ కూడా అపోహలకు తెరదించేందుకు స్పీడ్ పెంచింది. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్ దస్తగిరితో పాటు రిమాండ్‌లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం హైదరాబాద్‌లో తొలిసారి విచారించింది. దీంతో వచ్చే కొన్ని నెలల్లోనే వివేకా మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందన్న అభిప్రాయం కలుగుతోంది. మరి సీబీఐ ఇదే స్పీడ్ కొనసాగిస్తుందో నాలుగురోజులు హడావుడి చేసి మళ్లీ సైలెంట్ అయిపోతుందో చూడాలి.