తెలంగాణా కాంగ్రెస్ లో అంతా సద్దుకుందని అనకున్నారు. మాణిక్ రావు ఠాక్రే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని అందరూ అనుకున్నారు. సీనియర్లంతా ఒక్కతాటిపై నడవడానికి ముందుకు వచ్చారని మురిసిపోయారు. ఇక అధికారాన్ని ఎగరేసుకుపోవడమే ఆలస్యం అని ఎగిరి గంతేశారు. అయితే నాలుగు అడుగులు ముందుకు పడ్డాయో లేదో కానీ మళ్లీ అంతా మామూలే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అందించిన సందేశాలను హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలకు అందించాలన్నది ఈ కార్యక్రమం లక్షం. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ నేత తమ తమ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొనాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. మాణిక్ రావు ఠాక్రే అయితే యాత్ర ఆరంభానికి మూడురోజుల ముందే హైదరాబాద్ వచ్చి సీనియర్ నేతలందరికీ ఫోన్లు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచిస్తున్నారు.
ఒక విధంగా ఆయన బతిమాలుకుంటున్నారని సమాచారం. అయితే హాత్ సే హాత్ జోడో యాత్ర మొదటి రోజునే సీనియర్ నేతలు ఎవ్వరూ కూడా కనిపించలేదు. దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. హాత్ సే హాత్ జోడో యాత్ర కు సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సీనియర్లకు కంటగింపైంది. తెలంగాణాలో పార్టీని గెలిపించుకోడానికి అవసరమైతే తాను పాదయాత్ర చేస్తానని కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మరి కొందరు సీనియర్ నేతలు కూడా అధిష్టానం ఓకే అంటే పాదయాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపారు. అయితే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసే అవకాశాన్ని సోనియా గాంధీ ఒక్క రేవంత్ రెడ్డికే ఇవ్వడంతో సీనియర్లంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తాము కేవలం నియోజకవర్గ స్థాయి నేతలుగా మిగిలిపోతామని వారు ఆందోలన చెందుతున్నారు. హైకమాండ్ కూడా పార్టీలో కొత్తగా వలస వచ్చిన రేవంత్ రెడ్డికి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడమేంటని వారు రగిలిపోతున్నారు. అందుకే హాత్ సే హాత్ జోడోయాత్రకు చాలా మంది సీనియర్లు దూరంగా ఉన్నారు.
ఎవరికి వారు విడి విడిగా వారి వారి నియోజక వర్గాల్లో యాత్రలు చేసుకుంటే పార్టీ అంతా ఒక్కతాటిపై ఉందన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లదని వారు అంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన కాంగ్రెస్ విడిపోయిందన్న ప్రచారమూ జరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అదే రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలో సీనియర్లందరినీ భాగస్వాములను చేస్తే అది పార్టీకి ఎంతో మేలు చేస్తుందని సీనియర్లు అంటున్నారు. ఇపుడీ వైఖరిని చూసి ఠాక్రే తల బాదుకుంటున్నారు. అంతా సవ్యంగా నడుస్తోందని అనకుంటోన్న తరుణంలో సీనియర్లు కొత్త సమస్య తెచ్చి పెడితే ఎలాగ అని ఆయన పార్టీ వర్గాలతో అన్నట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశించినా కూడా సీనియర్లు యాత్రల్లో పాల్గొనకపోవడం క్రమశిక్షణారాహిత్యంకిందకే వస్తుందని పార్టీలోని ఓ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. అధిష్ఠానాన్ని బేఖాతరు చేసిన వారిపై తగిన శిక్షలు ఉంటేనే పార్టీ సజావుగా ముందుకు సాగుతుందని వారంటున్నారు.
అయితే ఎన్నికల ఏడాదిలో సీనియర్ల పై వేటు వేయడం అంటే అది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందంటున్నారు రాజీకయ విశ్లేషకులు. సీనియర్లే కాదు ఆ మాటకొస్తే ఎన్నికల ఏడాదిలో కింది స్థాయి కార్యకర్తను కూడా దూరం చేసుకోకూడదని వారు సూచిస్తున్నారు. అవసరమైతే హైకమాండే సీనియర్లను పిలిపించి చర్చించాలని సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టించాలని వారు అంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలో సీనియర్లు అలిగి ఇంట్లో కూర్చుంటే రేవంత్ రెడ్డి జనంలో మరింత పాపులర్ అయితే మొదటికే మోసం వస్తుందేమోనని కొందరు సీనియర్లు బిక్కు బిక్కు మంటున్నారు. ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు తమకు సురక్షితమైన దారన్నదే లేకుండా పోయిందని సీనియర్లు మధన పడుతున్నారట. కొద్ది రోజుల క్రితం తెలంగాణా కాంగ్రెస్ లో మరమ్మతు పనులు మొదలు పెట్టి ఆశలు కల్పించింది ఠాక్రేనే. ఇపుడు కూడా ఠాక్రేనే పార్టీని ఓ గాడిన పెట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.