ప్రశాంత్ కిషోర్ చాలా మందికి నిద్ర పట్టనివ్వడం లేదు. వైసీపీలో చాలా మంది ఓడిపోతారని పీకే నివేదికలు చెబుతుంటే ఎమ్మెల్యేలకు ఊపిరాడటం లేదు. పైగా గడప గడపకు నిరసనలు తలనొప్పిగా మారాయి. అన్ని చోట్ల టీడీపీ బలపడటం మరో సమస్యగా పరిణమించింది. ఈ పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నిన్నటికి నేటికి అక్కడ చాలా తేడా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో పరిస్థితులు నేతల పనితీరుపై ప్రజల స్పందనలు నమోదు చేసిన ఐ ప్యాక్ టీమ్ సర్వే రిపోర్టులు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో 13 స్థానాలను వైసీపీ గెలుపొందింది. ఇప్పుడు ఒకరిద్దరు గెలిస్తేనే కష్టమని సర్వేలు చెబుతున్నాయి.
జగన్ మొదటిసారి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు ఏలూరు నుంచి గెలిచిన ఆళ్ల నాని, కొవ్వూరు నుంచి తానేటి వనిత, ఆచంట నుంచి విజయం సాధించిన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ప్రాతినిధ్యం లభించింది. మంత్రి వర్గ విస్తరణలో ఆళ్ల నాని, శ్రీరంగనాథరాజు పదవులు కోల్పోయారు. అనూహ్యంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకి మంత్రి పదవులు దక్కాయి. ఇక తానేటి వనితను యథావిథిగా కొనసాగించారు. కేబినెట్ విస్తరణ తర్వాత కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండగా వారిలో తానేటి వనితకు మాత్రం అంతకు ముందున్న శాఖను మార్చి ఏకంగా హోంశాఖను కట్టబెట్టారు
ఏపీలో పొలిటికల్ సర్వేల సీజన్ కొనసాగుతూనే ఉంది. అందులోనూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ఐ ప్యాక్ టీమ్ సర్వే చేసింది. ఆ సర్వేలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ఎదురీత తప్పదని తెలుస్తోంది. అందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. దాంతో ముగ్గురు మంత్రుల పనితీరుపై పార్టీ వర్గాల్లోనే చర్చలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు ఆశావహుల వ్యతిరేక ప్రచారాలు శాపంగా మారాయి.
కొవ్వూరులో మంత్రి వనిత అంతర్గతంగా పార్టీ నేతల నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెండు ముూడు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గానికి వనిత కాపు కాస్తున్నారన్న ప్రచారం తీవ్రస్థాయిలోనే ఉంది. అంతేకాకుండ కొవ్వూరులో అత్యంత కీలకమైన ఓ సామాజికవర్గాన్ని పట్టించుకోకపోవడంతో వారంతా ఆమెకు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో వనిత ఈ సారి కొవ్వూరును వదిలేసి గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా నియోజకవర్గంలో వ్యతిరేకతకు కారణమవుతోంది.
కారుమూరి నాగేశ్వరరావుకు తణుకులో కొందరు వైసీపీ నేతలు దూరంగా ఉంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు అదే వర్గానికి చెందిన నేతలు దూరంగా ఉన్నారని సొంత పార్టీలోనే టాక్ నడుస్తోంది. మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా తాడేపల్లిగూడెంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడేపల్లిగూడెంలోనూ టీడీపీ బలంగా తయారుకావడంతో రాజకీయంగా కొట్టును కష్టాలు వెంటాడుతున్నాయి. దానితో ఇప్పుడు ముగ్గురు మంత్రుల్లో ఒక్కరైనా గెలుస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.