తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఆయా పార్టీల రాజకీయ నాయకుల నోట కూల్చివేతల హామీలు, పేల్చివేతల హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హాత్ జే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయినా రేవంత్ వెనక్కి తగ్గలేదు. ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుంది. తెలంగాణ ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్‌ను పేల్చేయాల్సిందే అని పునరుద్ధాటించారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రేగిన కలకలం పూర్తిగా చల్లారకముందే బీజేపీ కూడా రంగంలోకి దిగి మరో కూల్చివేతకు పిలుపునిచ్చింది.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా కట్టిన సచివాలయం డోమ్‌లు కూల్చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే కొత్త సచివాలయం తాజ్‌మహల్ లాగా అద్భుతంగా ఉందని ఎం.ఐ.ఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అసదుద్దీన్ కళ్లల్లో ఆనందం చూడ్డానికే కేసీఆర్ సచివాలయాన్ని తాజ్‌మహల్‌లాగా కట్టాడు అని బండి సంజయ్ ఆరోపించారు. తాజ్‌మహల్ అనేది ఒక సమాధి అంటే సచివాలయం వారికి ఒక సమాధిలాగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. తాము తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం పైన నిర్మించిన డోమ్‌లు కూల్చేయడం పక్కా అని స్పష్టం చేశారు.
వాటిని కూల్చేసి తెలంగాణ, భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మార్పులు చేయిస్తామని బండి సంజయ్ చెప్పారు. పార్టీ ప్రచార కార్యక్రమం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా ఈరోజు ఆయన బోయిన్ పల్లిలో మాట్లాడారు. ఇక నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లపైన ఉన్న మతపరమైన నిర్మాణాలను కూల్చేస్తామని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలపైనా బండి సంజయ్ స్పందించారు. దమ్ముంటే ఆ పనేదో ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించాలని సవాల్ విసిరారు. ఓల్డ్ సిటీలో మసీదులున్నా గుళ్లున్నా చర్చీలున్నా కూల్చాలనన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్ రెండూ ఒకటే అన్నారు సంజయ్. వాళ్లిద్దరూ ఒకటి కాకపోతే జీహెచ్‌ఎంసీలో అధికారం ఎలా పంచుకున్నారు అని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించడానికి ఆ రెండు పార్టీలో అసెంబ్లీలో ఒకరిని ఒకరు తిట్టుకున్నట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు.