వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు…పరస్పర విమర్శలతో అగ్గిరాజేస్తున్నారు. 25వేల కోట్ల రూపాయల వరద నష్టం కింద కేంద్రం సాయం చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసలు పంటనష్టాన్ని అంచనా వేయకుండా…నివేదిక పంపకుండా…టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ బీజేపీ మండిపడుతోంది.
తెలంగాణలో ఇటీవలే విత్తిన, మొలకెత్తే దశలో ఉన్న పంటలు నీట మునిగాయ్. కొన్ని విత్తనాలు భూమిలోనే కుళ్లిపోతే…మరికొన్ని కొట్టుకుపోయాయ్. పది లక్షలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
ఎన్నికల సమయంలో ఇంటింటా తిరిగే నేతలు…వర్షాలతో అల్లాడిపోతున్న జనాన్ని పట్టించుకోవడం లేదు. పరస్పర విమర్శలు చేసుకుంటూ…పబ్బం గడుపుతున్నారు. గ్రౌండ్ లెవల్ లోకి వెళ్లి…బాధితుల కష్టాల గురించి ఆరా తీసే నాయకులే కరువయ్యారు. తమను తాము ఓదార్చుకోవడం తప్ప…చేసేదేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించి…బాధితులనుఆదుకోవాలని ఆశిద్దాం.