సంక్షేమ మంత్రం పనిచేయడం లేదా..! సర్వేల్లో టాప్-10లో ఎందుకు లేరు?

By KTV Telugu On 19 July, 2022
image

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జనాదరణ… రోజురోజుకు పలచబడుతోందా ? దేశంలోనే ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్నా…ప్రజలు నమ్మడం లేదా ? సభలు, సమావేశాలు, అడ్వర్టయిజ్ మెంట్లతో…ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలను ఊదరగొడుతున్నా జనం మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకిలా జరుగుతోంది ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్…ప్రజాసంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు. బడ్జెట్ లో మెజార్టీ నిధులను వేల్ఫేర్ స్కీంలకే ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రఖ్యాత సెంటర్ ఫర్ నేషనల్ ఒపినియన్ సర్వేలో..కనీసం టాప్-10లో స్థానం సంపాదించలేకపోయారు. ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెల తెలంగాణ సర్కార్ అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయ్.

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయ్. ప్రజాసంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, ఆయన మంత్రివర్గ అనుచరులు… పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా…వేల్ఫేర్ ధ్యేయమంటూ…ప్రతిచోటా చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో…కింది నుంచి ఆరో స్థానంలో నిలిచారు. 151అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్…మూడేళ్లలోనే అధ:పాతాళానికి పడిపోయారు.

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్…ప్రథమ స్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మొన్నటి వరకు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఉద్దవ్ థాక్రే, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ టాప్-5లో నిలిచారు. వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డులకెక్కారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి… భిన్నంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవహరిస్తారు. ఏం చేసినా…ఏ నిర్ణయం తీసుకున్నా… రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడాలనే తపిస్తారు. అందుకే ఆయనకు ఒడిషా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హడావిడి ఎక్కువ…ఏ కార్యక్రమం చేపట్టినా తామే ఫోకస్ కావాలని చూస్తారు. తెలంగాణ, ఏపీల్లో అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు సంక్షేమం పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నా…జనం మాత్రం నమ్మడం లేదు. రెండు రాష్ట్రాలు అప్పుల మీదే నడుస్తున్నాయ్. ఒక నెల అప్పులు పుట్టకపోయినా…ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం. జీతాలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయ్.