కొడాలిని ఓడించేందుకు రేణుకాస్త్రం సంధించనున్న చంద్రబాబు

By KTV Telugu On 11 February, 2023
image

మబ్లుల్లో నీళ్లు చూసి కుండ ఒలకబోసుకునేవాళ్లని ఏమనాలి సరైన విజన్ లేదనాలి. రెండు పడవలపై కాళ్లు పెట్టి నదిని దాటేయాలనుకునేవాళ్లని ఏమనాలి మెడుల్లా అబ్లాంగేటా దెబ్బతిందేమో అనుకోవాలి. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వ్యవహారం అలానే ఉందంటున్నారు రాజకీయ పండితులు. అసలు రేణుక ఏం చేస్తున్నారు ఎందుకు ఆమెపై వదంతులు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీయార్ వీరాభిమానిగా ఉండి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచినపుడు జరిగిన ప్రజాఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రేణుకా చౌదరి పార్టీ అధ్యక్షుడు నందమూరి తారకరామారావు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అలా టిడిపిలో ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయిపోయారు.
కృష్ణా జిల్లాకి చెందిన రేణుకా చౌదరి రాజకీయాల్లో మాత్రం ఖమ్మం జిల్లా నుంచే బరిలో దిగుతూ వచ్చారు. తాజాగా ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుండే బరిలో దిగుతానని రేణుక ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఆ తర్వాత 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అవసరమైతే పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానన్నారు.

అక్కడితోనూ ఆగకుండా ఏపీలో గుడివాడ నియోజక వర్గం నుండి కూడా పోటీచేసే అవకాశాలున్నాయన్నారు. ఇలా ఇన్ని చోట్ల నుండి పోటీ చేస్తానని ప్రకటిస్తే తాను వార్తల్లో ఉంటాననుకున్నారో ఏమో కానీ దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువంటున్నారు ఆమె అనుచరులు. తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం నుండి పోటీ చేస్తానంటూనే ఏపీలో గుడివాడ నుండి కూడా పోటీ చేస్తానంటే అర్ధం ఏంటి. ఒక వేళ గుడివడలో గెలిస్తే ఖమ్మం సీటుకు రాజీనామా చేస్తారా. మరి ఎంపీ సీటు మాటేంటి అసలింతకీ ఆమె ఏ నియోజకవర్గంలో పదవిలో కొనసాగుతారు అన్నవి అయోమయంగా మారాయి. ఈ గందరగోళంలో ప్రజలు అసలు ఆమెకు ఓటేసే పరిస్థితి ఎక్కడ ఉంటుందని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు.
ఏపీపై మనసు ఉంటే తెలంగాణాలో ఎందుకు పోటీచేయాలన్న ప్రశ్న కచ్చితంగా తెలంగాణ ప్రజల్లో వస్తుంది. అసెంబ్లీ కావాలా పార్లమెంటు కావాలా అన్న విషయంలోనే ఆమెకు క్లారిటీ లేదంటే అర్ధం ఏంటి. ఇది ఓటర్లతో చెలగాటం ఆడ్డమే కదా అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

నిజానికి ఆమె గుడివాడ నుండి పోటీ చేస్తారా. టిడిపిలో ఉన్నప్పుడే ఉమ్మడి ఏపీలోనే ఆమె గుడివాడ నుండి పోటీ చేయలేదు. ఇపుడుఎందుకు చేయాలనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఒకటి వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడికి కంట్లో నలుసులా తయారైన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ. అక్కడ నానిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు 2014, 2019 ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గుడివాడలో కొడాలి నాని ప్రాభవానికి తిరుగులేకపోయింది. వచ్చే 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నానిని ఓడించి తీరాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఎంతగా అంటే టిడిపి అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదు కానీ కొడాలి నాని మాత్రం గెలవడానికి వీల్లేదని చంద్రబాబు భావిస్తున్నారు.

అందుకే నానికి సరియైన ప్రత్యర్ధి రేణుకా చౌదరేనని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఖర్చు అంతా తనే చూసుకుంటానని కేవలం వచ్చి నామినేషన్ వేసి పోటీ చేయడమే మీ పని అని రేణుకకు చంద్రబాబు పెద్ద ఆఫర్ ఇచ్చారట. అందుకే రేణుకా చౌదరి గుడివాడ వైపు చూస్తున్నారన్నది రాజకీయ పరిశీలకులు అనుమానం. అయితే ఆమె తన నియోజకవర్గంపై క్లారిటీతో లేకపోతే ఏ నియోజకవర్గంలోనూ ప్రజలు ఆమెను నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు రాజకీయ పండితులు. రేణుకా చౌదరి దశాబ్దాల క్రితం చేసిన రాజకీయాలు ఇపుడు వర్కవుట్ కావంటున్నారు వారు. రాజకీయాల ట్రెండ్ మారిపోయిందని దానికి అప్ డేట్ కాకపోతే రేణుకా చౌదరి భారీ మూల్యం చెల్లించక తప్పదని వారు అంటున్నారు. అయితే పోరాటాలకు జంకే ప్రసక్తే లేని రేణుకా చౌదరి దేన్నీ అంత వీజీగా వదిలి పెట్టరంటున్నారు నిపుణులు.