రేవంత్ రెడ్డి పాదయాత్ర సజావుగానే సాగుతోంది. స్థానికంగా పార్టీ సీనియర్లు సహకరించకపోయినా ఆయన ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. చాలా మంది అభిమానులు స్వచ్ఛంధంగా వచ్చి రేవంత్ వెంట నడుస్తున్నారు. టీపీసీసీ చీఫ్ యాత్ర ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలోకి ఎంటరైంది. అక్కడి జనం నుంచి ఆయనకు విశేష స్పందన లభిస్తోంది..
రేవంత్ అంటే యూత్. యూత్ అంటే రేవంత్ అన్నట్లుగా యాత్ర కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విసుగుచెందిన వర్గాలన్నీ ఇప్పుడు హాత్ సే హాత్ జోడో అంటున్నాయి. రేవంత్ కు చేయి కలుపుతూ ముందుకు నడుస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ సీనియర్లు కలిసిరాకపోయినా యువత మాత్రం రేవంత్ వెంటే ఉంది. ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక, కేసీఆర్ ప్రభుత్వ కల్లబొల్లిమాటలతో విసుగుచెందిన యువకులంతా జై రేవంత్ అంటున్నారు. రేవంత్ వస్తారు.. కష్టాలు తీరతాయన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు. పైగా సీతక్క లాంటి నిస్వార్థ ప్రజా సేవకుల మద్దతు రేవంత్ కు ఉండటం ఇప్పుడు ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యింది..
ములుగులో రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం ఎవరికీ ఉండదంటూ ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రేవంత్ వ్యాఖ్యలపై ములుగు పోలీస్ స్టేషన్‌లో స్థానిక బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్‌పై ములుగు పీఎస్‌లో కేసు నమోదు అయింది. తర్వాత మహబూబాబాద్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.. రేవంత్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు..అయినా భయపడలేదు. రేవంత్ రెండో సారి కూడా తన వ్యాఖ్యలను రిపీట్ చేశారు. సామాన్య ప్రజలకు, ప్రతిపక్షాలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను పేల్చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసుల ఆధారంగా రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పాదయాత్ర జరగకుండా చేస్తారేమోననే వాదనలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపించాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను అరెస్టు చేసి కొన్నిరోజుల పాటు పాదయాత్ర అడ్డుకున్నట్లే రేవంత్ ను కూడా ఆపుతారని భావించారు. ప్రభుత్వం కూడా తొలుత ఆ దిశగా ఆలోచన చేసిందని చెబుతున్నారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ కు యూత్ లో క్రేజ్ పెరిగిందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చింది. ఆయన్ను అరెస్టు చేస్తే నిరసనలు, హింస జరిగే అవకాశం ఉందని అనుమానించారు. షర్మిల వేరు, రేవంత్ వేరని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు తిరగబడితే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని కూడా లెక్కగట్టారు.. దానితో ఇప్పుడు రేవంత్ ఏమి మాట్లాడినా కేసులు పెట్టడం, రాజకీయంగా ఎదుర్కోవడం లాంటి చర్యలు తప్పితే అరెస్టుల దాకా వెళ్లకూడదని భావిస్తున్నారు. అదే ఆయనకు శాపమవుతుందా, వరమవుతుందా చూడాలి.