అశ్విన్, జడేజా స్పిన్‌కు అల్లాడిన ఆసిస్‌

By KTV Telugu On 11 February, 2023
image

కంగారులు భయపడినట్టే జరిగింది. భారత్‌లో స్పిన్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని మరోసారి ఆసిస్ బ్యాట్స్‌మెన్లకు అర్థమైంది. అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ముందే జడుసుకున్న ఆసిస్ ప్లేయర్లు మైదానంలోకి దిగాక మరింతగా బెదిరిపోయారు. అశ్విన్‌ను ఢీకొట్టడం కోసం మ్యాచ్‌కు ముందు ఏకంగా డూప్లికేట్ బౌలర్‌ను తెప్పించుకున్నారు. కానీ ప్రభావం చూపలేకపోయారు. అశ్విన్, జడేజాల స్పిన్ మాయాజాలంలో చిక్కుకొని వికెట్లు పారేసుకున్నారు. దాంతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్వదేశీ గడ్డపై భారత్‌ తమకు తిరుగులేదనిపించుకుంది.

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా చేతులెత్తేసిన పిచ్‌పై మనోళ్లు దుమ్ముదులిపారు. రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లు రాణించడంతో మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 177పరుగులకే ఆలౌట్ అయిన ఆసిస్, రెండో ఇన్నింగ్స్‌లో 91పరుగులకే తోకముడిచింది. దాంతో రెండున్నర రోజుల్లోనే ఖేల్ ఖతమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన 25పరుగులే టాప్ స్కోర్.

మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి ఆసిస్‌ను కట్టడి చేసిన అశ్విన్ ఏకంగా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో కంగారుల నడ్డివిరిచాడు. మొత్తం 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏడు వికెట్లు తీసుకున్న జడేజా అటు బ్యాటింగ్‌లోనూ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసుకోవడం విశేషం. నాగ్‌పూర్ పిచ్‌కు సంబంధించి మ్యాచ్‌కు ముందు ఆసిస్ భయపడింది. భారత స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్‌ తయారు చేశారని ఆరోపణలు చేశారు. అయితే భయపడినట్టే పిచ్‌పై కంగారులు తేలిపోయారు. కానీ ఆసిస్ ప్లేయర్లు చతికిల బడిన చోట మనోళ్లు సత్తా చాటి గ్రాండ్ విక్టరీ కొట్టారు.