పోడు భూముులకు పట్టాలను ఈ నెలాఖరు నుంంచే పంపిణీ చేస్తామనికేసీఆర్ ప్రకటించారు. ఇలా కేసీఆర్ ప్రకటించడం మొదటి సారి కాదు. గతంలోనే ఇదే ప్రకటన అసెంబ్లీలో చేశారు. గిరిజనుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలకు ముందు మరోసారి పట్టాల పంపిణీ ప్రకటన చేశారు. ఏకంగా 11.5లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి దాకా చేయలేని పోడు భూముల పంపిణీ ఇప్పుడు సాధ్యమా చట్టాలు అంగీకరిస్తాయా.
పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అన్ని పార్టీలు ఒప్పుకుంటే నెలాఖరు నుంచే ప్రారంభిస్తామన్నారు. కేసీఆర్ గత ఎన్నికలకు ముందు తర్వాత అసెంబ్లీలో ప్రజా దర్బారు పెట్టి పోడు పట్టాలు ఇచ్చేస్తామన్నారు. ఆ తర్వాత ఒక ఇంచు కూడా ఆక్రమణ కానివ్వమని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇంకా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. అది అంతకంతకూ తీవ్రమవుతోంది. తాజాగా అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు. పట్టాలిస్తామన్నారు. ఎంత మందికి ఇస్తామన్నది క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరికి లెక్క ప్రకారం భూములు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల పట్టాతోపాటు వాళ్లకు విద్యుత్ కెనెక్షన్ ఇచ్చి రైతు బంధు కూడా ఇస్తామన్నారు. కానీ పట్టాలు తీసుకునే వాళ్లు భవిష్యత్లో అడవిని కాపాడే కాపాలాదారులు కావాలన్నారు. దీన్నిరాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా తేలికగా పరిష్కారమయ్యే సమస్య కాదని ముందస్తు ఎన్నికల కారణంగా పట్టాలిచ్చేందుకు ఎప్పుడూ లేని విధంగా అఖిలపక్ష ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. తెలంగాణ సమస్యకూ పెట్టని అఖిలపక్ష సమావేశాన్ని పోడు భూముల సమస్యకు పెట్టడం వ్యూహాత్మకమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పోడు భూములు హక్కు కాదని ఆక్రమణ అని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో నివాసం ఉండే గిరిజనులు కొంతమేర అడవిని కొట్టి వివిధ రకాలు పంటలు పండించుకుంటారు. ఇవే కొంతమందికి ప్రధాన జీవనాధారం. అడవులు కొండ వాలుల్లో చిన్న చిన్న చెట్లను పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయంగా పిలుస్తారు. ఇలాంటి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుని తెలంగాణ లో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. అయితే ఈ భూములపై వారికి ఎలాంటి హక్కు లేదు. అవన్నీ ప్రభత్వ భూములే. వీటికి హక్కులు కల్పించాలని చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. వీరు చేస్తుంది తప్పు అని రాజకీయ పార్టీలూ ఎప్పుడూ చెప్పలేదు కదా ఇంకా పట్టాలిస్తామని ఆశ కల్పించారు. ఫలితంగా పోడు వ్యవసాయం అంతకంతకూ పెరిగిపోతూ వస్తోంది. వేల ఎకరాల్లో అడవులు నరికివేతకు గురవుతున్నాయి.
2006లో అమల్లోకి వచ్చిన అటవీ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పత్రాలివ్వాలి. గరిష్ఠంగా నాలుగు హెక్టార్లు ఇవ్వాలి. ఆ తర్వాత సాగు చేసుకుంటున్న వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ పట్టాలివ్వడానికి అవకాశం లేదు. మరోవైపు 1/70 చట్టంపైనా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అడవుల్లో ఆదివాసులకే ఆస్తి హక్కు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి 1/70 చట్టాన్ని తెచ్చింది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం అంతరించి పోతున్న తెగలను కాపాడలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్నీ అమలు చేయాల్సి ఉంది. తెలంగాణలో రెండు వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14వేల 353 దరఖాస్తులు పోడు భూములకు పట్టాల కోసం ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూమి చూసుకుంటే 12లక్షల 46వేల 846 ఎకరాలుగా ఉంది. పోడు సమస్యను పరిష్కరించి 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ చట్టం ప్రకారం 2005కి ముందు వాటికే అంటే లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హత ఉంది. అంటే చట్టానికంటే ఎక్కువగా దాదాపుగా పది లక్షల ఎకరాలకు పట్టాలివ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఎలా సాధ్యం చేస్తారన్నది ఇప్పుడు కీలకం.
కేసీఆర్ ప్రతి ఎన్నికలకు ముందు ఇలా ప్రకటించడం సహజమేనని ఇదంతా అయ్యేది కాదని ఎక్కువ మంది అభిప్రాయం. మరి కేసీఆర్ ఈ సారి నిజం చేసి చూపిస్తారా.