ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

By KTV Telugu On 12 February, 2023
image

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించించిది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ను నియమించింది. ప్రస్తుతం ఇక్కడ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్ ను చత్తీసగఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. బిశ్వభూషన్‌ హరిచందన్ 2019 జులై 24న ఏపీ గావర్నర్‌గా వచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌ కోషియార్, లద్దాక్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్‌ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. ఆ తరువాత మొత్తం 13 రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

చత్తీస్గఢ్‌ గవర్నర్ అనసూయను మణిపూర్‌కు అక్కడి గవర్నర్ గణేశన్‌ను నాగాలాండ్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా బీహార్‌ గవర్నర్‌గా ఉన్న చౌహాన్‌ను మేఘాలయాకు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ను బీహార్‌కు బదిలీ చేసింది కేంద్రం. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా త్రివిక్రమ్‌ పట్నాయక్‌, జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా శివప్రసాద్‌ శుక్లా, లడఖ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఏపీకి కొత్త గవర్నర్‌గా రాబోతున్న జస్టిస్ అబ్దుల్‌ నజీర్ 1958 జనవరి 5న జన్మించారు. 2003లో కర్నాటక హైకోర్టులో అడిషనల్ జడ్జీగా చేరారు. 2004లో అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన పదవీ విరమణ చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు కీలకమైన కేసుల్లో తీర్పులు ఇచ్చారు. వాటిల్లో అయోధ్య స్థల వివాదం, ట్రిపుల్‌ తలాక్‌, వ్యక్తిగత గోప‌్యత కు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అన్నింటిలోకి రైట్‌ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్‌ రైట్‌ అని ఇచ్చిన తీర్పు అత్యంత కీలకమైనదిగా పేర్కొంటారు.