ఖైరతాబాద్ లో సెంటిమెంట్ పనిచేయదా.. దానం నాగేందర్ కు షాక్ తప్పదా…

By KTV Telugu On 21 July, 2022
image

ఒకప్పుడు అక్కడ ఏ గల్లీలో చూసినా కాంగ్రెస్ జెండాలు. అక్కడ గెలిస్తే మంత్రి పదవి రావడం ఖాయమన్న సెంటిమెంట్ ఎప్పుడూ నిజం అవుతూనే ఉంటుంది. గెలుపులో పెద్దగా మలుపులు కనిపించవు.  మాస్ మహారాజాలు ఎక్కువ ఉండే ప్రాంతంలో దానం నిదానంగా గెలుస్తారా..కాంగ్రెస్ కంగుతునిపిస్తుందా..కాషాయ పార్టీ గెలుస్తుందా…

2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఖైరతాబాద్ జనాభా పరంగా ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడు దర్శనం కోసం ఏటా తరలివచ్చే ప్రాంతం ఇదే. అలాంటి స్థానంలో పోటీ ఒక గొప్ప అవకాశం భావిస్తుంటారు.  ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి గతంలో మంత్రి కూడా అయ్యారు. 2018 ఒకప్పటి కాంగ్రెస్ అడ్డాలో టీఆర్ఎస్ గెలిచింది. కానీ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ గెలిచిన దానంకు మాత్రం మంత్రి పదవి రాలేదు. ఆ అసంతృప్తి ఉన్నా….తనకు పరిచయం ఉన్న నియోజకవర్గంలోనే అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఒకప్పుడు మాస్ లీడర్ గా ఉన్నదానం ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ ను వదులుకున్నట్టు కనిపిస్తోంది. జాతీయ పార్టీలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో స్వత్రంతగా పనిచేసేవారు. కానీ కాంగ్రెస్ ను వదిలి ప్రాంతీయ పార్టీలో చేరిన తర్వాత కాస్త ఇబ్బంది పడుతు వెళ్తున్నారు. పార్టీ పరిమితుల మధ్య ఉండిపయారు. నియోజకవర్గంలో అంటీముట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. కింది స్థాయి నేతలతోను పెద్దగా సంబంధాలు కొనసాగించాలన్న ఆసక్తి దానంలో కనిపించడంలేదు.. ప్రట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాల్లో మొక్కుబడిగా నిర్వహించారన్న టాక్ ఉంది.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దానంనాగేందర్ ఖైరతాబాద్ స్థానం నుంచే టీఆర్ఎస్ అభ్యర్ధిగానే పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు ఏమంత సానుకూలంగా లేవన్న ప్రచారం ఉంది. దానం తీరుపై పార్టీలో సంతృప్తి లేదు. అలాగని దానం లాంటి సీనియర్ నేతను కాదని మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు.  ఒకనాటి కాంగ్రెస్ అడ్డాలో టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా దానంనాగేందర్  తీరు కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఈపరిస్థితులు గమనించే పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారన్నఅభిప్రాయం ఉంది. పీజేఆర్ అడ్డా ఖైరతాబాద్ . ఐదుసార్లు ఇక్కడే గెలిచి మాస్ లీడర్ గా బస్తీ వాసులు గుండెల్లో చెరగని ముద్ర వేశారు.  ఆ వారసత్వాన్ని సరిగా అందుకోలేక విష్ణు వర్దన్ రెడ్డి జూబ్లిహిల్స్ కే పరిమితం  అయిపోయారు. గత  ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ సీటు దక్కించుకున్న దాసోజ్ శ్రవణ్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకమే. ఇన్నాళ్లు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నా ఇప్పుడు మళ్లీ పోటీ ఇక్కడ నుంచి కష్టమనే చెప్పాలి. బీజేపీ విషయానికి వస్తే రామచంద్రారెడ్డి 2014లో టీడీపీతో పొత్తు ఉండటం వల్లే గెలిచారు. ఆ తర్వాత పోటీ చేసినా ఫలితాలు నిరాశనే కలిగించాయి. చంద్రబాబును, టీడీపీని దూరం పెడుతున్న బీజేపీ ఈ స్థానంలో గెలవడం అసాధ్యమనే చెప్పాలి. సీమాంధ్ర ఓటర్లను రేవంత్ రెడ్డి తన పార్టీ వైపు లాగేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

రాజ్ భవన్ తోపాటు కీలక మైన ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరిన ప్రాంతం ఖైరతాబాద్. మధ్య , దిగువ తరగతి వర్గాల ప్రజలు, ఉద్యోగులు ఎక్కువగా నివసించే నియోజవర్గం. మాస్ ఓటర్ల మనసు గెలిచిన అభ్యర్ధే ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తుంటారు. వరదల సమయంలో ఇక్కడ బస్తీలన్నీ మునిగిపోతుంటాయి. ప్రభుత్వం ఏటా తాత్కాలిక పనులతో సరిపెడుతుంటుంది. పెరుగుతున్న జనాభాకి తగట్టు మౌలిక వసతులు లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వాలు మారిన తమ బతుకులు మాత్రం బాగుపడలేదన్న అసంతృప్తి స్థానికుల్లో ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి మూలమైన డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం చాలా మంది పేదలు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. మురుగునీటి కష్టాలు, సాగర్ దుర్గంధం సమస్య అలానే ఉంది.

ఖైరతాబాద్ లో ఇప్పటి వరకు 9 సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. 2014 వరకు నియోజకవర్గంలో తిరుగులేని పార్టీగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ నేతలు ఒక్కోక్కరుగా వీడటంతో బలహీన పడింది. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ ఒక్కసారి గెలిచింది. టీఆర్ఎస్ కూడా 2018లో అనూహ్యంగానే గెలిచింది. మరోసారి విజయం కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తన స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విజయారెడ్డి రాకతోపార్టీకి మేలు జరుగుతుందని భావిస్తోంది. దూరమైన పీజేఆర్ అభిమానులు దగ్గరవుతారని అంచనా వేస్తోంది.

ఖైరతాబాద్ గణేశుడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. నియోజవర్గానికి ప్రత్యేకత కూడా ఇదే. హుస్సేన్ సాగర్ చెంతనే ఉండే ఈ ప్రాంతంలో పూర్వ వైభవం కోసం టీఆర్ఎస్ తో సై అంటోంది కాంగ్రెస్ . వచ్చే ఎన్నికల్లోనైనా మంత్రి పదవి సెంటిమెంట్ మళ్లీ మొదలవుతుందో.. లేదో చూడాలి.