రష్యాకు చెందిన గర్భవతులు అర్జంటీనాలో ప్రసవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెలలు నిండగానే టూరిస్టు వీసాలు తీసుకుని అర్జంటీనాకు వెళ్లిపోయి పిల్లల్ని కంటున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు సుమారు 5వేల కంటే ఎక్కువమందే రష్యన్ మహిళలు అర్జంటీనాలో డెలివరీ అయ్యారని అధికారుల అంచనా. గత గురువారం ఒకే రోజు ఒకే ఫ్లైట్‌లో 33 మంది నెలలు నిండిన గర్భవతులు అర్జంటీనాలో దిగడం చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. వీళ్లంతా అర్జంటీనాలో ప్రసవించడం వల్ల వారి పిల్లలకు ఇక్కడి పౌరసత్వం వస్తుందనే ఆశతోనే రష్యా నుంచి రిస్క్ తీసుకుని వస్తున్నారని అర్జంటీనా నేషనల్ మైగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య సంవత్సరంపైగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
టూరిస్టు వీసాలపై వచ్చిన ఒకేరోజు ఒకే ఫ్లైట్‌లో వచ్చిన 33 మందిలో ముగ్గురి దగ్గర సరైన పత్రాలు లేనందున వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వాళ్లు అసలు విషయం వెల్లడించారు. అర్జంటీనాలో డెలివరీ అయితే తమ పిల్లలకు ఈ దేశ పౌరసత్వం వస్తుందనే ఆశతో ఇక్కడికి వచ్చామని చెప్పారు. రష్యాకంటే అర్జంటీనాలో స్వేచ్ఛ ఎక్కువ…ఈ దేశ పాస్పోర్టుతో 171 వీసా ఫ్రీ దేశాల్లో పర్యటించవచ్చు. అదే రష్యా పాస్పోర్టుతో కేవలం 87 దేశాల్లోనే వీసా ఫ్రీ అనుమతి ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరువాత పలు పశ్చిమ దేశాల్లో పర్యటించడం రష్యన్ పౌరులకు ఇబ్బందిగా మారింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈయూ, రష్యా మధ్యన ఉన్న వీసా ఒప్పందం రద్దైపోయింది.
దాంతో రష్యన్ పౌరులకు యురోపియన్ దేశాల వీసాలు మంజూరు చేయడం మరింత కఠినంగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరువాత సుమారు 2 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయారని ఒక అంచనా. పలు దేశాలు రష్యా మీద తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినా అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఈ యుద్ధం ఎప్పుడు అంతం అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రష్యన్ మహిళలు తమ పిల్లల భవిష్యత్ కోసం అర్జంటీనాకు వెళ్లి ప్రసవిస్తున్నారని నేషనల్ మైగ్రేషన్ ఏజెన్సీ చెబుతోంది.