ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నారా చంద్రబాబు నాయుడు.
ఆయన మంత్రి వర్గంలో మంత్రిగా డిప్యుటీ స్పీకర్ గా వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఆ ఉద్యమంతోనే తెలంగాణా సాధించుకుని దానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కేసీయార్. ఇక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీయార్ హయాంలోనే కాదు ఆ తర్వాత కూడా ఇద్దరూ కీలకపాత్ర పోషించారు. పార్టీలో జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసిందే కేసీయార్ అంటారు. కమ్యూనిస్టు పార్టీలు బిజెపిల తరహాలో పార్టీ కార్యకర్తలకు అన్ని అంశాలపైనా అవగాహన కల్పించేందుకు తరచుగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్న కాన్సెప్ట్ కూడా కేసీయార్ దే. దాన్ని చంద్రబాబు అమలు చేశారంతే. అదే టిడిపిని దశాబ్దాల పాటు కాపాడింది.
రాజకీయాల్లో ఎవరి నిచ్చెన మెట్లు వాళ్లే తయారు చేసుకోవాలి. ఎన్టీయార్ నుండి ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకోడానికి చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు. అయితే అది వెన్నుపోటు అని ప్రజాస్వామిక వాదులు ఆరోపించారు. నిజానిజాలు పక్కన పెడితే పార్టీ నేతలను, ఎన్టీయార్ తనయులతో పాటు తోడల్లుడు దగ్గుబాటిని కూడా నిచ్చెన మెట్లుగా వాడుకుని ఒక్కో మెట్టు ఎక్కి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. అలా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కేసీయార్ డిప్యూటీ స్పీకర్ గా నియమితులయ్యారు. అయితే ఆ ఉద్యోగం పట్ల కేసీయార్ ఏ మాత్రం సంతృప్తిగా లేని పరిస్థితి. చంద్రబాబుతో సమానంగా రాజకీయ వ్యూహాలు పన్నగల తనకు కేబినెట్ లో కీలక పదవి ఇవ్వాలన్నది కేసీయార్ వాదన. చంద్రబాబు మాత్రం కేసీయార్ కు మంత్రి పదవి ఇవ్వలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లు మొండిగా వ్యవహరించారు. చంద్రబాబు తీసుకున్న ఈ కఠిన నిర్ణయమే ఆంధ్ర ప్రదేశ్ ను రెండు ముక్కలు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
కానీ ఏపీ విభజనకు బీజం పడింది ఇక్కడే. మంత్రి పదవి ఇవ్వని బాబు ప్రభుత్వంలో కొనసాగేందుకు ఏ మాత్రం ఇష్టపడని కేసీయార్ టిడిపికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణా సాధించుకోడానికి ఉద్యమం మొదలు పెట్టారు. అందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితిని పేరిట ఉద్యమ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత అదే రాజకీయ పార్టీ అయ్యింది.
ఉద్యమాన్ని నడిపించడం అంటే మాటలు కాదు. ఎన్నో వ్యూహాలు ఎత్తుగడలు ఉండాలి. అవన్నీ కేసీయార్ లో పుష్కలంగా ఉన్నాయి. అన్నింటినీ మించి ప్రజలను మంత్ర ముగ్ధులను చేసే ప్రసంగాలు చేయడంలో కేసీయార్ ను మించిన వక్తలు దేశంలోనే వేళ్ల మీద లెక్కపెట్టగల స్థాయిలో మాత్రమే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ విషయంలో ఆయన్ను కొట్టేవాళ్లే లేరు. నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, వాక్చాతుర్యం పకడ్బందీ వ్యూహాలతోనే కేసీయార్ కేంద్రంలోని యూపీయే మెడలు వంచి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారో అలానే కేసీయార్ అధికారాన్ని సొంతం చేసుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. తమ రాజ్యాలు స్థాపించుకున్న వెంటనే ఇద్దరూ కూడా తమ సుపుత్రులను ప్రమోట్ చేసుకోడానికి పావులు కదిపారు. చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కీలకమైన ఐటీ మంత్రిత్వ శాఖ కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడి తనయుడిగా ప్రభుత్వంలో నెంబర్ టూ గానే చక్రం తిప్పారు లోకేష్. అటు తెలుగుదేశం పార్టీలోనూ చంద్రబాబు తర్వాత లోకేషే నిర్ణాయక శక్తిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పొందడంతో పాటు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో అయినా గెలిచి తనయుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే తండ్రిగా తన బాధ్యత తీరిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇటు కేసీయార్ కూడా తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తన రాజకీయ వారసునిగా సిఎం సీటుపై చూడాలని ముచ్చట పడుతున్నారు. లోకేష్ మాదిరిగా కాకుండా కేటీయార్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలిచారు. లోకేష్ బాటలోనే కేటీయార్ కూడా ఐటీ మంత్రే అయ్యారు. కాకపోతే పరిపాలనలోనూ నిర్ణయాల్లోనూ ప్రసంగాల్లోనూ కేసీయార్ తనయుడిగా కేటీయార్ సమర్ధవంతంగానే ముందడుగులు వేస్తున్నారు. నిజానికి ఏడాది క్రితమే కేటీయార్ ముఖ్యమంత్రి అయిపోతారని ప్రచారం జరిగింది. కొందరు సీనియర్ నేతలు సిఎం కేటీయార్ అంటూ నినాదాలు కూడా చేశారు. కేటీయార్ ను ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కించడానికి మంచి ముహూర్తం కోసమే కేసీయార్ కూడా చూస్తున్నారు. అయితే ఈ దఫా కాకుండా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని అప్పుడు దర్జాగా కేటీయార్ ను సిఎంని చేయాలని కేసీయార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తన కుమారునికి పోటీ అవుతారనుకున్న జూనియర్ ఎన్టీయార్ ను చంద్రబాబు పక్కన పెట్టినట్లే కేసీయార్ కూడా కేటీయార్ కు తలనొప్పులు ఉండకూడదని హరీష్ రావును పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని పార్టీ సీనియర్లు అంటారు. ప్రభుత్వంలో కీలమైన ఆర్ధిక మంత్రి భాద్యతలు అప్పగించారు కెసిఆర్.
2014 లో బిజెపితో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బిజెపితో అధికారాన్ని పంచుకున్నారు చంద్రబాబు. 2018 వరకు ఎన్డీయేలోనే ఉన్న చంద్రబాబు ఎన్నికల ఏడాదిలో ఎన్డీయే నుండి బయట పడ్డారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపైనా బిజెపి విధానాలపైనా నిప్పులు చెరిగారు. మోదీని ఓడించడమే తన జీవిత ధ్యేయం అన్నారు. భార్య కుటుంబం లేని మోదీకి దేశ ప్రజల కష్టాలు ఎలా అర్దం అవుతాయంటూ వ్యక్తిగత దూషణలూ చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తనపై దాడులు చేస్తుందని భయం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ,ఐటీ లతో తనపై దాడులు చేయిస్తారని తనకు ప్రజలే రక్షణగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సిబిఐ తన అవినీతిపై దర్యాప్తుకు వచ్చే వీలు లేకుండా చేయడానికి ఏకంగా సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జీవో పాస్ చేశారు.
విచిత్రంగా కేసీయార్ కూడా చాలా అంశాల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలకు మద్దతునిచ్చారు. ఏడాది క్రితం నుంచే ఉన్నట్లుండి మోదీపై విరుచుకు పడుతున్నారు. బిజెపి వల్ల దేశం నాశనమైపోతోందని దుయ్యబడుతున్నారు. బిజెపిని ఓడించడానికే బి.ఆర్.ఎస్. పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని దూకుడు ప్రదర్శించారు కేసీయార్. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన కుమార్తె కవిత పేరును పేర్కొనడంతో బిజెపి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపుకు తెగబడుతుందని అనుమానించిన కేసీయార్ సిబిఐకి తెలంగాణాలో నో ఎంట్రీ అంటూ జీవో తెచ్చారు.
ముందస్తు ఎన్నికల విషయంలోనూ ఇద్దరు చంద్రులు ఒకేలా వ్యవహరించారు. 1999లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్లకే విపరీతమైన ప్రజాగ్రహాన్ని చవి చూశారు. మంత్రుల పట్ల తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందని గమనించిన చంద్రబాబు నాయుడు తిరుపతిలో అలిపిరి ఘాట్ రోడ్డుపై మావోయిస్టుల మందుపాతరలో గాయపడ్డ వెంటనే సానుభూతి పవనాలు వీస్తాయన్న అంచనాతో ముందస్తు ఎన్నికలకు పాచిక వేశారు.
కేంద్రంలోని వాజ్ పేయ్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేంద్రంలోనూ ఒకేసారి ఎన్నికలు వచ్చేలా చేసుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు తల్లకిందులయ్యాయి. సానుభూతి ఎక్కడా కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు కూడా నాలుగేళ్లకే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని నివేదికలు రావడంతో వ్యతిరేకత మరింతగా పెరగడానికి ముందే ఎన్నికలకు పోవడం మంచిదని నిర్ణయించారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అయితే కేసీయార్ వ్యూహం వర్కవుట్ అయ్యింది. ముందస్తు ఎన్నికల్లో కేసీయార్ మరింత బలం పుంజుకుని భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు.
ఇపుడు 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేసీయార్ 2024 ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేసకుని దూసుకుపోతున్నారు. ఈ లక్ష్యాల్లో ఇద్దరూ విజయవంతం అయితే మాత్రం తమ కుమారులకు పట్టాభిషేకం చేసేసి ప్రశాంతంగా రాజకీయాల నుండి ఈ ఇద్దరూ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. రాజకీయ వ్యూహాల్లోనూ ప్రత్యర్ధులను చిత్తు చేయడంలోనూ అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో ఇద్దరు చంద్రులూ ఛాంపియన్లే అంటారు రాజకీయ పండితులు.