ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌కి సెగ తగులుతోంది. తెరవెనుక చక్రంతిప్పిన సౌత్ గ్రూప్‌లోని కీలక నిందితులపై ఈడీ ఫోకస్ పెట్టింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్టుతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కూడా జరగొచ్చని భావిస్తున్నారు. డెబ్భై ఏళ్లనుంచీ లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఇలాంటి స్కామ్‌లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి. వ్యాపారవర్గాల కుట్రని మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆరోపణలుచేస్తున్నా సౌత్ గ్రూప్‌లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో ఈడీ చార్జిషీట్ పక్కా ఆధారాలు చూపిస్తోంది.
ఉత్తరాది వ్యాపారుల కుట్రే కావచ్చు. కానీ దక్షిణాది ముఖ్యులు మాకేం సంబంధం లేదన్న వాదన తేలిపోతోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రూప్ నిందితులు ఏయే సమయాల్లో ఏమేం చేశారో కాల్‌డేటా సమేతంగా ఈడీ దగ్గర అన్ని సాక్ష్యాలూ ఉన్నాయి. ఆ సాక్ష్యాల వల్లే మొదట కేవలం విట్నెస్ మాత్రమే అనుకున్న కల్వకుంట్ల కవిత కూడా చివరికి నిందితురాలిగా చార్జీషీట్కి ఎక్కారు. కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, చెన్నై, నెల్లూరుల్లోని ఎంపీ మాగుంట కార్యాలయాలు, నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన ఈడీ చివరికి ఎంపీ కొడుకు అరెస్ట్‌తో మరిన్ని కీలక పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులైన శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరా అరెస్టు సమయంలోనే ఎంపీ మాగుంట పేరు ప్రముఖంగా వినిపించింది. ఉత్తరాది వ్యాపారుల కుట్రంటూ ఎంపీ ఆ ఆరోపణలను ఖండించినా చివరికి వ్యవహారం ఆయన కొడుకు అరెస్ట్‌దాకా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కొడుకుతో రాజకీయ అరంగేట్రం చేయించే ప్రయత్నాల్లో ఉన్న మాగుంటకు ఇదో షాక్. మాగుంట రాఘవరెడ్డిని 10రోజుల ఈడీ కస్టడికీ కోర్టు అనుమతించింది. రాఘవరెడ్డి అరెస్ట్ కాగానే కేసీఆర్ కుటుంబంలో గుబులు మొదలైంది. కేంద్రంతో సఖ్యంగా ఉండే వైసీపీకి చెందిన ఎంపీ కొడుకునే అరెస్ట్ చేశాక కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్ కూతురిని అస్సలు వదలకపోవచ్చు. ఏ క్షణమైనా ఈడీ బేడీలు ఆమెదాకా వచ్చేలా ఉన్నాయి.