ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వదిలి చాలా రోజులైనా పార్టీలో ఇంకా ఆయనపై చర్చ జరుగుతూనే ఉంది. రాజేందర్ మళ్లీ రావాలన్న ఆకాంక్ష అధికార పార్టీ వర్గాల్లో కనిపిస్తోందన్న ప్రస్తావన పదే పదే తలెత్తుతోంది. ఈటల లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడు తమ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మరింత శక్తిమంతంగా తయారవుతుందన్న విశ్వాసం సగటు బీఆర్ఎస్ అభిమానిలో కలుగుతోంది. అందుకే చిన్న ప్రస్తావన వచ్చినా పార్టీ నేతలు ఆశగా ఈటల వైపు చూస్తున్నారని చెప్పుకోవాలి.
ఓటమి ఎరుగని ఈటల రాజేందర్ మొదటి నుంచి ఫైర్ బ్రాండ్ నాయకుడే. ఎవరినైనా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడాయన. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంటే ఉంటూ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. మంత్రిగా తెలంగాణ సంక్షేమం కోసం అహరహం కృషి చేశారు. ఒకప్పుడు కేసీఆర్ సైన్యంలో ఈటల కీలక సైనికాధికారి. కొంతకాలం క్రితం పార్టీ అధినేతతో విభేదించారు దూరం జరిగారు. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వెళ్లూ వెళ్లూ కేసీఆర్ ను నాలుగు మాటలు కూడా అనేశారు. బీజేపీలో చేరిన ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ హుజురాబాద్ నుంచే గెలిచారు. ఆయన పాపులారిటీ ముందు అధికార పార్టీ మంత్రాంగం పనిచేయలేదు. ఈటల ఘనవిజయం సాధించారు. ఇదీ సమకాలీన చరిత్ర.
ఈటల పట్ల కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని చెప్పేందుకు అసెంబ్లీలో జరిగిన చర్చే ఉదాహరణగా చెప్పోచ్చు. మిత్రులు రాజేందర్ గారు, ఈటల రాజేందర్ గారు.. ఇలా కేసీఆర్ పదే పదే ప్రస్తావించారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఈటల చెప్పిన ప్రతీ అంశాన్ని కేసీఆర్ సావధానంగా విన్నారు. ఆయన చెప్పిన విషయాలను నమోదు చేసుకుని సత్వర పరిష్కారానికి ప్రయత్నించాలని హుటాహుటిన అర్థికమంత్రి హరీష్ రావును ఆదేశించారు. రాజేందర్ గారి సలహాలు కూడా తీసుకోండని కేసీఆర్ అన్నప్పుడు అసెంబ్లీలో ఘర్ వాపసీ అన్న నినాదాలు వినిపించాయి. బీఆర్ఎస్ సభ్యుల మొహంలో ఆనందం కనిపించింది. అయితే ఆ నినాదాలను కేసీఆర్ గానీ ఈటల గానీ ఖండించకపోవడంతో ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయ్యింది. ఈటల పేరును కేసీఆర్ మొత్తం 18 సార్లు ప్రస్తావించారు. ఈటల కోరిన డైట్ చార్జీల సంగతి వెంటనే చూడాలని సూచించారు. ఈటలకు అది తెలుసు ఈటలకు ఇది తెలుసు. ఈటలకు అన్ని తెలుసు అని కేసీఆర్ అన్నారు. సమస్య ఉంది కాబట్టే ఈటల మాట్లాడుతున్నారని ఆకాశానికెత్తేశారు.
నిజానికి బీజేపీలో చేరిన తర్వాత ఈటలకు అనుకున్నంత ప్రాధాన్యం దక్కలేదు. చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయన ద్వారా బీజేపీలో ఎవరూ చేరలేదనే చెప్పాలి. పైగా టీబీజేపీ అధ్యక్షుడి బండి సంజయ్ తో ఆయనకు నిత్యం పేచీ కొనసాగుతోంది. ఈటలను తొక్కెయ్యాలని సంజయ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ పంచాయతీ బీజేపీ అధిష్టానం దగ్గరకు చేరినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. ఈటల అసంతృప్తి కొనసాగుతుండగానే ఆయన్ను మళ్లీ బీఆర్ఎస్లోకి పిలుస్తున్నట్లు కొంతకాలం క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. తిరిగొస్తే గత ప్రాధాన్యం కొనసాగిస్తూ డిప్యూటీ సీఎం పదవి ఆఫరిచ్చినట్లు కూడా కథనాలు ప్రచురించారు. వాటన్నింటినీ అప్పట్లో ఈటల ఖండించారు. కేసీఆర్ గేమ్ ప్లాన్లో భాగంగా ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం అసెంబ్లీలో కేసీఆర్ ప్రశంసించిన తర్వాత కూడా రాజేందర్ అదే మాట చెబుతున్నారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని ఈటల అంటున్నారు. కేసీఆర్ అబద్దాన్ని అటూ చెప్పగలరు ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. బీఆర్ఎస్ లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని గెంటేసినవాళ్లే స్వయంగా పిలిచినా పోయే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు. తన ప్రశ్నలకు సమాధానం రాబట్టడం వేరు పార్టీలో చేరడం వేరని ఆయన తేల్చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో కూడా కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల ఆరోపించిన నేపథ్యంలోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పక తప్పదు.
కేసీఆర్ గేమ్ ప్లాన్ అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కాకపోతే తనను కేసీఆరే తరిమేశారని ఈటల చెప్పుకుంటున్నారు. నిజానికి పెద్దలు జానారెడ్డి అని పిలుస్తూ మాజీ హోం మంత్రిని తొక్కేసినట్లే ఇప్పుడు ఈటల విషయంలో కూడా జరుగుతోందన్న టాక్ మొదలైంది. అయితే జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న కేసీఆర్ తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలనుకుంటున్నారు. బీజేపీలో ఈటల ఒక్కరే బలమైన నాయకుడన్న విశ్వాసం కేసీఆర్ కు ఉంది. కమలం పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాజేందర్ మరో దారి వెదుక్కునే లోపే తమ వైపుకు లాక్కోవాలన్న కోరిక కేసీఆర్ లో కనిపిస్తోంది. మరి రాజేందర్ ఘర్ వాపసీ సాధ్యమా అంటే కాలమే సమాధానం చెప్పాలి.