దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్లోకెల్లా ఎక్కువగా ప్రజా విశ్వాసం నిలబెట్టుకున్న వ్యవస్థ న్యాయవ్యవస్థ. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్లు న్యాయమూర్తులయినా ఎప్పుడూ ప్రజల్లో అనుమానాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం రిటైరైన వెంటనే న్యాయమూర్తులు పదవులు చేపడుతూంటంతో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా గత నెలలోనే రిటైరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించడంతో ఈ చర్చ ప్రారంభమయింది. అయితే ఇది ఏ మాత్రం ఆరోగ్యకరమైన చర్చ కాదు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించే చర్చ. దీనికి కారణం పదవులు చేపడుతున్న మాజీ న్యాయమూర్తులేనని చెప్పక తప్పదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ అక్కడ రిటైర్ కాగానే ఇక్కడ ఏపీలో గవర్నర్ గా పదవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్క సారిగా న్యామయూర్తులు వారి తీర్పులు అనంతరం వారికి లభిస్తున్న పదవులు అంశంపై జోరుగా చర్చ ప్రారంభమయింది. 2014లో సుప్రీంకోర్టు సీజేఐగా పని చేసిన జస్టిస్ సదాశివంను కేరళ గవర్నర్ గా నియమించింది నరేంద్రమోదీ ప్రభుత్వం. అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రోజులు. అందుకే చాలా మంది స్వేచ్చగా తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే ఈ అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సీజేఐగా పని చేసి తాను గవర్నర్ కావడం అంటే పరువు తక్కువ అని జస్టిస్ సదాశివం కూడా అనుకోలేదు. ఆయన కూడా పదవి తీసుకున్నారు. అప్పట్నుంచి ప్రారంభమయింది. ఆ తర్వాత పదవులు ఇవ్వడం ఎక్కువైంది. సీజేఐగా పని చేసిన రంజగన్ గోగోయ్ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయన ఆ పదవిని యాక్సెప్ట్ చేసినప్పుడు జరిగిన రచ్చ చర్చ అంతా ఇంతా కాదు. అప్పుడు అబ్దుల్ నజీర్ విషయంలోనూ అంతే. మరికొంత మంది ఇతర మాజీ న్యాయమూర్తులకూ పదవులు లభించాయి.
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది న్యాయమూర్తులకు పదవులు ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ కు పదవి ఇచ్చారు. ఆయన తీరు వివాదాస్పదమయింది. హైకోర్టుపై కుట్ర చేసినట్లుగా ఆయన ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన రాజా ఇళాంగోకు కూడా ఏపీ ప్రభుత్వం ఓ పదవి ఇచ్చింది. ఇక మాజీ న్యాయమూర్తులు సీవీ నాగార్జున రెడ్డి, శేష శయనారెడ్డితో పాటు తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. ఆయన కూడా కరోనా టైంలో వచ్చి బాధ్యతలు చేపట్టారు. నిజానికి రాజ్యాంగ వ్యతిరేక నియామకం. తర్వాత సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. కానీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ కనగరాజ్ ఆ పదవిని చేపట్టడానికి ఏ మాత్రం సంకోచించలేదు. తర్వాత ఆయనకు మరో పదవి ఇచ్చారు. ఇలా ఏపీలో చాలా మంది మాజీ న్యాయమూర్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు కల్పించే పదవులు ఇచ్చింది.
న్యాయమూర్తులు రిటైరైన తర్వాత పదవులు చేపట్ట కూడదా అని కొంత మంది ప్రశ్నిస్తారు. పదవులు చేపట్టడం నిబంధనలకు ఏ మాత్రం విరుద్ధం కాదు. వారికి ఆ స్వేచ్చ ఉంది. కానీ ఈ పదవుల కోసం వారు తమ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పక్షపాతంగా తీర్పులు చెప్పలేదని గ్యారం ఏమీ ఉండదు. అందుకే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పదవులు పొందిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై మీడియాలో సోషల్ మీడియాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. వాటిలో విశ్వసనీయతను ప్రశ్నించడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితికి అవకాశం కల్పించింది. కేంద్రం పదవులు ఇచ్చిన జస్టిస్ రంజగన్ గోగొయ్, జస్టిస్ సదాశివం, జస్టిస్ అబ్దుల్ నజీర్ వంటి వారు ఇచ్చిన తీర్పులను ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ట్రాల్లో పదవులు ఇస్తున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తులు పదవిలో ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పులనూ విశ్లేషిస్తున్నారు. అంతా క్విడ్ ప్రో కోనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం కల్పిస్తోంది పదవులు పొందుతున్న న్యాయమూర్తులే.
వ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడుకోవాల్సింది ఆ వ్యవస్థలో భాగమైన వారే. లేకపోతే ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి కొంత మంది మాజీ న్యాయమూర్తులే కారణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అత్యున్నత స్థాయిలో పని చేసిన తర్వాత వారికి ఎలాంటి పదవులైనా చిన్నవే. ఎలాంటి పదవి చేపట్టినా వారిచ్చిన తీర్పులపై చర్చలు మొదలవుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సింది రిటైరైన న్యామయూర్తులే. ఇలా కొంత మంది పదవులు చేపట్టడం ద్వారా కొత్తగా వ్యవస్థలోకి వస్తున్న వారికి ఏం సందేశం ఇస్తున్నారో కానీ మొత్తంగా ఇది ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం మాత్రం అంతటా ఉంది. అందుకే ఈ విషయంలో వారు కూడా ఆలోచించాల్సి ఉంటుందేమో.