ఢిల్లీ టెస్టుకు టీమిండియా రెడీ.. సూర్య ప్లేస్‌లో గిల్‌

By KTV Telugu On 14 February, 2023
image

టీ 20 హీరో, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ రెండో టెస్టుకు డౌటేనని తెలుస్తోంది. సెలెక్టర్లు అతన్ని పక్కన బెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. నాగ్ పూర్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ, సూర్యకు మరో అవకాశం ఇచ్చే ఆలోచన కనిపించడం లేదు. అతని స్థానంలో గిల్‌ను జట్టులోకి తీసుకురానున్నారట. వాస్తవానికి మొదటి టెస్టులోనే మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ను తీసుకోవాలనే ఒత్తిడి సెలెక్టర్లపై వచ్చింది. కానీ సూర్యవైపే మొగ్గుచూపారు. అయ్యర్‌ స్దానంలో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ నాగ్‌పూర్‌ టెస్టులో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆడింది ఓ ఇన్నింగ్సే అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని సూర్య సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఢిల్లీ టెస్టుకు గిల్‌ను తీసుకోవాలని జట్టు మెనేజెమెంట్‌ భావిస్తోంది. గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి కేఎల్‌ రాహుల్‌ను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ పంపాలని రోహిత్ ద్రవిడ్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టులో విఫలమైన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కెఎస్‌ భరత్‌ను రెండో టెస్టుకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు స్పిన్నర్‌ కుల్దీపస్‌ యాదవ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం జట్టులో అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ రూపంలో బలమైన స్పిన్ విభాగం ఉంది. వీరు ముగ్గురు కూడా తొలి టెస్టులో అద్భుతంగా రాణించారు. కుల్దీప్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ రెండు టెస్టును బట్టి ఆ తర్వాతి మ్యాచ్‌లో మార్పు చేసే అవకాశముంది.

నాగ్‌పూర్ మాదిరే ఢిల్లీలోని దుమ్ముదులపాలని భారత్‌ భావిస్తుంటే ఆస్ట్రేలియా మాత్రం ఎలాగైనా రోహిత్ సేన దూకుడుకు అడ్డుకట్ట వేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి టీమిండియా అదరగొడుతోంది. టీ20లు, వన్డేలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ విజయాల పరంపర కొనసాగిస్తోంది. శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకొని ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను గెలిచి మూడు ఫార్మాట్లలోనే నంబర్ వన్ హోదాను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.