వైసీపీ ఎమ్మెల్యేల్లో స‌ర్వేల గుబులు

By KTV Telugu On 15 February, 2023
image

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూర‌మే మంచిది. చెప్ప‌డానికి మొహ‌వాట‌ప‌డి త‌ర్వాత బావురుమ‌నేకంటే ముందే చెప్పేస్తే ఏ గొడ‌వా ఉండ‌దు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఆ విష‌యంలో అస్స‌లు మొహ‌వాటాల్లేవ్‌. అందుకే హ‌లో బాస్ మీరు లాభంలేద‌ని మొహంమీదే చెప్పేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఎపిసోడ్స్ త‌ర్వాత దూద్‌కా దూద్ పానీకాపానీ అన్న‌ట్లు పార్టీ నేత‌ల విష‌యంలో మ‌రింత నిక్క‌చ్చిగా ఉంటున్నారు వైసీపీ అధినేత‌. వైనాట్ 175టార్గెట్ ల‌క్ష్య‌మే అది. చ‌చ్చులు పుచ్చుల‌ను ఏరేసి నిఖార్స‌యిన స‌రుకునే ఎన్నిక‌ల్లో దించాల‌నుకుంటున్నారాయ‌న‌.

ఫీల‌యితే ఫీల‌య్యారు. అలిగివెళ్లిపోతే పోనీ. డ‌బుల్‌స్టాండ్‌మీద ఉన్న‌దెవ‌రో అవ‌కాశ‌వాదంతో వ్య‌వ‌హ‌రించేదెవ‌రో ముందే తేలిపోతుంది. అందుకే నివేదిక‌ల్లోని విష‌యాల‌మీద వ‌న్‌టూవ‌న్ కాదు ఓపెన్‌గా అంద‌రిముందే చ‌ర్చిస్తున్నారు మంత్రుల విష‌యంలో కూడా మిన‌హాయింపుల్లేవు. ఈ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి డేరింగ్ డాషింగ్‌గా వెళ్తున్నార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. సీఎం కూర్చుని ఉన్న వేదిక‌మీద ఆయ‌న మాట‌గా మ‌రొక‌రు వ‌చ్చి ఫ‌లానా ఫ‌లానా వాళ్లు ప‌బ్లిక్‌లో వెనుక‌బ‌డ్డార‌ని చెప్ప‌డ‌మంటే బ‌హుశా ఏ పార్టీలోనూ ఇది సాధ్యంకాదు.

ఏడాదిపైన మ‌రో రెండ్నెల్ల టైం ఉందంతే. ఇప్ప‌టికే గ‌డ‌ప‌కూ గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వం అంటూ ఎమ్మెల్యేల‌ను నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రుగులు పెట్టిస్తున్నారు త‌ర‌చూ స‌మీక్ష‌ల‌తో ఎవ‌రు ముందున్నారో ఎవ‌రు వెనుక‌బ‌డ్డారో చెప్పేస్తున్నారు. దీంతో మార్కులు త‌క్కువొచ్చిన ఎమ్మెల్యేలు మ‌ళ్లీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర‌య్యే స్టూడెంట్స్‌లా క‌ష్ట‌ప‌డుతున్నారు. టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్న‌వాళ్లంతా హ్యాపీ. మ‌రి లాస్ట్ టెన్‌లో ఉన్న‌వాళ్ల ప‌రిస్థితేంటి. అంద‌రిముందే త‌మ పేర్లు చ‌దువుతుంటే వాళ్ల మొహాలు మాడిపోతున్నాయి. ఎగ్జామ్ బాగా రాశాం మీరే మార్కులేయ‌లేద‌ని అడ్డం తిర‌గ‌లేరు. ప‌చ్చివెల‌క్కాయ గొంతులో ఇరుక్కున్న‌ట్లే ఉంది చివ‌రినుంచి టాప్ టెన్‌లో ఉన్న‌వాళ్ల ప‌రిస్థితి.

డిసెంబరు 16 నుంచి ఫిబ్రవరి 13 మధ్య కాలంలో వీక్‌గా ఉన్న‌వారి పేర్ల‌ను మీటింగ్‌లోనే ఎనౌన్స్ చేశారు. సీఎం చెబితే వేరు. కానీ క్షేత్ర‌స్థాయిలో స‌ర్వేచేసే ఐప్యాక్ సంస్థ ప్ర‌తినిధి వ‌చ్చి వెరీపూర్ అంటూ పేర్లు చ‌ద‌వ‌డం ఆ లిస్టులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకు మింగుడుప‌డ‌టం లేదు. మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదిమూలపు సురేష్ లాస్ట్‌బెంచ్‌లో ఉన్నారంటున్నారు. అలాగే ఎమ్మెల్యేల్లో ఊరంత నోరున్న కొడాలి నానితో పాటు వసంత కృష్ణప్రసాద్, ఉద‌య‌భాను, అప్ప‌ల‌న‌ర్స‌య్య‌, చెన్న‌కేశ‌వ‌రెడ్డి, చింత‌ల రామ‌చంద్రారెడ్డి, అన్నా రాంబాబు, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, గ్రంథి శ్రీనివాస్‌, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, శ్రీనివాస‌నాయుడు, సుచ‌రిత‌, ప‌ద్మావ‌తి ఉన్నారంటున్నారు. స‌చివాల‌యాల్లో త‌క్కువ స‌మ‌యం గ‌డిపిన‌వారి లిస్ట్ కూడా అధినేత ద‌గ్గ‌ర ఉండ‌టంతో వైసీపీ నేత‌ల‌కు ఊపిరాడ‌టం లేదు పాపం!