వై నాట్ 175 – యుద్ధానికి సంసిద్ధం

By KTV Telugu On 15 February, 2023
image

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో ముందుకు పోతోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్లే యుద్ధానికి సంసిద్ధం అవుతోంది. పార్టీలోని ప్రతీ నేతనూ అందుకు సమాయత్తం చేస్తోంది. అందుకోసం అనునిత్యం జనంలోనే ఉండాలని సూచిస్తోన్న జగన్ మోహన్ రెడ్డి జనంలో లేని నేతల విషయంలో మార్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలు కూడా పార్టీ అధ్యక్షుడి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని అంటున్నారు. n2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించి అధికారంలోకి వచ్చింది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ. ఇంచుమించు నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికీ అందుతున్నాయో లేదో ప్రజల నుండే అడిగి తెలుసుకోడానికి ఉద్దేశించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.

ఈ కార్యక్రమం ద్వారానే నిత్యం ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంటుందన్నది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ప్రజాప్రతినిథులు ప్రజలకు అందుబాటులో ఉండి తీరాలని ఆయన భావిస్తున్నారు. అందుకే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొత్తలోనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఒక్క ఏపీలోనే కాదు ప్రతీ రాష్ట్రంలోనూ ప్రజాప్రతినిథులు ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరహాలోనే జనంలోకి వెళ్లి మా ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవాలన్నారు. ఇటు వంటి కార్యక్రమం ప్రారంభించడానికి చాలా సాహసం ఉండాలన్నారు మేథావులు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉంటే జనంలోకి వెళ్లే ధైర్యం చేయలేరని. అమలు చేశారు కాబట్టే ధీమాగా ధైర్యంగా జనంలోకి వెళ్లాలన్న తలంపు వచ్చి ఉంటుందని వారు అభినందిస్తున్నారు.

కార్యక్రమం అయితే మొదలైంది కానీ 151 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తమ నియోజకవర్గంలో చిత్తశుద్ధిగా గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొంటున్నారో తెలసుకునేందుకు ఓ యంత్రాంగాన్ని పెట్టారు జగన్ మోహన్ రెడ్డి. తమ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా జనంతో మమేకం కావడానికి తమ ఎమ్మెల్యేలు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు తదితర అంశాలపై జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ నివేదికలు రాగానే సంబంధింత ఎమ్మెల్యేలను పిలిచి మీరు ఇంకా ఎక్కువగా జనంలో తిరగాలనో మీ పద్ధతి మార్చుకోండన్నా అనో చెబుతున్నారు. ఎన్నికలకు 14 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఎమ్మెల్యేల పనితీరు ఎక్కడైనా మార్చుకోవలసిన అవసరం ఉందా అన్న అంశంపైనా సర్వేలు నిర్వహించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా జనంలో తిరక్కుండా తిరిగామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతీ ఎమ్మెల్యే వెనుక ఐ ప్యాక్ ప్రతినిథి ఒకరు నిఘా ఉంటారు.

ఆ ఎమ్మెల్యే ఎన్ని గ్రామాలు తిరిగారు ఎంత సేపు తిరిగారు ఆయన పట్ల జనం ఎలా స్పందిస్తున్నారు అన్న అంశాలన్నీ కూడా ఆ ప్రతినిథి ఎప్పటికప్పుడు నివేదిక పంపేస్తారు. వాటన్నింటినీ క్రోడీకరించుకుని ఎక్కడైనా సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలన్నది జగన్ ఉద్దేశం. అదే విధంగా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత లేకపోయినా సానుకూలత తక్కువగా ఉన్న వారి విషయంలో వారిని మరింతగా జనానికి చేరువగా ఉండేలా చేయడం ద్వారా వాళ్ల గ్రాఫ్ పెంచాలన్నది ఆయన లక్ష్యం. అంతిమంగా ఒక్క నియోజకవర్గం కూడా ఓడిపోడానికి వీల్లేదని జగన్ మోహన్ రెడ్డి అందరికీ నూరిపోస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా మరో సర్వే నిర్వహించి జనంలో అసంతృప్తి ఉన్న నేతలను మాత్రం మార్చక తప్పదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సమీక్షా సమావేశంలో ఐ ప్యాక్ సర్వే నివేదిక ఆధారంగా టాప్ టెన్ లో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు లాస్ట్ టెన్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లనూ ప్రస్తావిస్తూ పనితీరు బాగా లేని వారు మెరుగు పర్చుకోడానికి ఇంకా అవకాశం ఉంది కాబట్టి కష్టపడాలని సూచిస్తున్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని ఇదే విషయాన్ని మీడియా ముందుచెప్పారు. ఏ నేత ఎంతసేపు జనంలో ఉన్నారో ఆయనకు తెలుసునని అన్న కొడాలి తన లాంటి వారు కుంటి సాకులు చెప్పినా ఆయన నమ్మరని అంతిమంగా వై నాట్ 175ని సాకారం చేసుకోవడమే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. తమ అధినేత లక్ష్యాలకు అనుగుణంగా మరింతగా కష్టపడ్డానికి తాను సిద్దంగా ఉన్నానని కొడాలి నాని వంటి సీనియర్ నేత చెప్పడం పార్టీలోని క్రమశిక్షణకు తిరుగులేని నిదర్శనం అంటున్నారు రాజకీయ పండితులు. సర్వేలో కొందరు మంత్రుల పనితీరు కూడా బాగాలేదని తేలింది. బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, వంటి నేతలను కూడా మీ పనితీరు మార్చుకోవలసిందిగా సూచించారట. మొదట్లో గడప గడపకు కార్యక్రమంలో అంత యాక్టివ్ గా పాల్గొనని ఎమ్మెల్యేలు సైతం తమ వెంట ఐప్యాక్ నిఘా ఉందని తెలిసిన తర్వాత చురుగ్గా పాల్గొంటున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎందుకోసం మొదలు పెట్టిన తమ ఎమ్మెల్యే తమ మధ్యలోనే ఉన్నారన్న భావన ప్రజల్లో కలగడానికి ఇది బాగా ఉపయోగ పడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీని వల్ల నేతలు కూడా ప్రజల్లో పాపులర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు ఒక సారి ఎమ్మెల్యేగా గెలిస్తే మళ్లీ అయిదేళ్ల తర్వాత ఎన్నికల్లోనే కలిసే పద్ధతికి గుడ్ బై చెప్పిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మేలే చేస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

వీరికి తోడు అయిదు లక్షలకు పైగా నియమించి శిక్షణ ఇచ్చిన గృహసారధులు మార్చి 18 నుండి ఇంటింటికీ తిరిగి జగన్ మోహన్ రెడ్డి స్టికర్లను అతికిస్తారు. దాంతో పాటే గత ప్రభుత్వ హయాంలో ఏమేమి పథకాలు అందేవి ఇపుడు అదనంగా ఏమేమి పథకాలు ఇస్తున్నాం అన్నది అందరికీ అర్ధమయ్యేలా వివరించడం గృహసారధుల పని. ఇది తిరుగులేని వ్యూహమే అంటున్నారు నిపుణులు. ప్రజలు ఏమనుకుంటున్నారో వారి ఆకాంక్షలుఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వాటికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను మలుచుకోవడం అనేది నిజంగానే అద్భుతమైన కార్యక్రమం అంటున్నారు వారు. ఐప్యాక్ సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేల్చిన వారిలోనే ఒకళ్లిద్దరు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కదన్న నిర్ణయానికి వచ్చి పక్క పార్టీలవైపు చూస్తున్నారని అంటున్నారు. కోటం రెడ్డి శ్రీధర రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం కచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికిన కేసులే అంటున్నారు పార్టీ నేతలు. ఎన్నికల లోపు వీలైనంత ఎక్కువగా జనంలో ఉంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగితే 175కి 175 స్థానాలు గెలవడం అసాధ్యమేమీ కాదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే నూటికి నూరు శాతం స్థానాలు గెలుస్తామన్న ఆశ మరి అతిశయోక్తిగా ఉందంటున్నారు విపక్ష నేతలు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదని రాజకీయ పండితులు సైతం సూచిస్తున్నారు.