దారి తప్పుతోంది మీడియానా ప్రభుత్వాలా ?

By KTV Telugu On 15 February, 2023
image

బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీపై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. ఈ దాడుల్లో ఏం కనిపెడతారన్న సంగతి పక్కన పెడితే ఈ దాడుల మోటో మాత్రం కక్ష సాధింపు అని ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది. ఇటీవల బీబీబీ గుజరాత్ అల్లర్లకు సంబంధించి డాక్యుమెంటరీని విడుదల చేసింది . దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ డాక్యమెంటరీని నిషేంధిచింది. ఇప్పుడు ఐటీ దాడులు చేసింది. ఈ ఐటీ దాడుల్లో బీబీసీ ఆఫీసులో ఏమీ దొరికాయదన్నది ప్రకటన రాలేదు. కానీ ఈ దాడులపై మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత్‌లో పత్రికా స్వేచ్చ లేదన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది. కానీ దేశంలో ఒక్క బీబీసీపైనే కాదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే ప్రతీ మీడియాపైనా దాడి జరిగింది . చాలా మీడియాలను అనుకూల నేతలు కొనేశారు. కొన్ని మాత్రం పోరాడుతున్నాయి. మరి భారత్ లో పత్రికా స్వేచ్చ ప్రెస్ ఫ్రీడం ఉన్నట్లేనా.

పత్రికా స్వేచ్చలో భారత్‌ది 150వ స్థానం ప్రజాస్వామ్యంలో నాలుగు పిల్లర్లలో మీడియా కూడా ఒకటి. కానీ ఆ పిల్లర్ బలహీనం అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ ప్రకటించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని తేల్చింది. పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్‌ స్థానం 150. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022 ఎడిషన్ లో ఈ విషయం తెలిపింది. అంటే మన కన్నా అధ్వాన్నంగా ముఫ్పై దేశాలు మాత్రమే ఉన్నాయి.

కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత మీడియా పూర్తిగా వన్ సైడ్ గా మారిపోయింది. లేకపోతే వేధింపులు ఎదుర్కొంది. ఇప్పుడు ఏ విషయంపైనైనా బీజేపీ గట్టిగా ప్రశ్నించే మీడియానే లేదంటే అతిశయోక్తి కాదు. ది వైర్ లాంటి కొన్ని డిజిటల్ వేదికలు కేంద్ర తప్పులను ఎత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ వాటికి ఎదురవుతున్న వేధింపుల గురిచి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సార్లు ఐటీ దాడులు జరిగాయి. ఇక అనేక మంది జర్నలిస్టులు తమ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ఎన్డీటీవీ కూడా చేతులు మారింది. దేశంలో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా వార్త వేయాలంటే కేంద్రంపై వస్తున్న ఆరోపణల విషయంలో విశ్లేషణ చేయాలంటే వణికిపోయే మీడియా సంస్థలే ఉన్నాయి. ధైర్యంగా అదానీ గురించి లేదా రఫేల్ స్కాం గురించి చెప్పగలిగే మీడియా లేదు. ఇదే పత్రికా స్వేచ్చపై దాడి అంటే.

దేశంలోని గుత్త పెట్టుబడిదారీ సంస్ధలు మీడియా రంగంలో ప్రవేశించటంతో పత్రికా స్వేచ్ఛ హరించుకు పోతున్నది. పాలక పక్షాలు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తున్నాయన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మీడియా వార్తలపై ప్రత్యక్ష సెన్సార్‌షిప్‌ విధించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ లేదా బిజెపి వాటితో జట్టుకట్టే పాలకవర్గ ప్రాంతీయ పార్టీలు మీడియా మీద పరోక్ష సెన్సార్‌ను అమలు జరుపు తున్నాయి. వారికి ఇష్టం లేని వార్త అసలు రాక పోవటం లేదా కనిపించీ కనిపించకుండా ఒక మూలన పడవేయటమో జరుగుతోంది. తమ విధానాలను ప్రశ్నించిన మీడియా సంస్దలకు ప్రకటనలు నిలిపి వేయటం, టీవీ ఛానల్స్‌ అయితే కేబుల్‌ నిర్వాహకులను బెదిరించి ఛానల్స్‌ ప్రసారాలను అడ్డు కోవడం మన కళ్ల ముందే ఉంది.

నేడు మీడియా సంస్ధలను డబ్బులు సంపాదించే పెట్టుబడి దారులు నడుపుతున్నారు తప్ప సంపాదకులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోతోంది. సంపాదన అధికారం ధ్యేయాలైన మీడియా నిర్వాహకులు వార్తలను అమ్ము కోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ కారణంగానే గతంలో ప్రస్తుతం ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిచడం కొనసాగుతున్నది. లొంగని వాటి ఆర్ధిక మూలాలను దెబ్బ తీసేందుకు తద్వారా వాటి మూతకు ప్రయతాలు జరుగడం నిత్యకృత్యమే. మీడియా స్వేచ్చకు కలుగుతున్న హాని గురించి ఒక్క మాట కూడా రాయలేని నిస్సహాయ సంపాదకులను నేడు మనం చూస్తున్నాం. ఫోర్త్‌ ఎస్టేట్‌గా మన్నననలను పొందిన మీడియా రియలెస్టేట్‌గా మారిపోయిందనే ఆరోపణలు నిత్యం వినాల్సి వస్తోంది.

ఒకప్పుడు మీడియా అంటే విశ్వసనీయత కానీ ఇప్పుడు లేదు. దాన్ని ఆసరా చేసుకుని రాజకీయ పార్టీలు ఆట ఆడుతున్నాయి. దీన్ని మీడియా సమాజమే గుర్తించాల్సి ఉంది. ముందు మీడియా లొంగిపోవడం మానేస్తే ధైర్యంగా అడగులేస్తే పత్రికా స్వేచ్చకు అదే పునాది అవుతుంది. పత్రికా స్వేచ్చ విషయంలో ప్రభుత్వాలది ఎంత తప్పు ఉందో మారుతున్న మీడియా శైలి కూడా దానికి అంతే కారణం !