నిన్న మొన్నటి దాకా కయ్యాలు తప్పలేదు. ఇప్పుడు అనివార్యతలు మారాయి. ఇద్దరూ కలిసుందాం రా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఉమ్మడి శత్రువు బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ట్రాక్ మార్చాలని, చేతులు కలపాలన్న ఆలోచన రెండు పార్టీల్లో కనిపిస్తోందని చెప్పక తప్పదు. అందుకే కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షంలా కనిపిస్తోందని కూడా చెప్పాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇదీ రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కూడా కాదు. బీజేపీ దూకుడుతో పాటు తాను అనుకన్న జాతీయ పార్టీ టేకాఫ్ కోసం కూడా కేసీఆర్ రూటు మార్చుతున్నారని చెప్పాలి. మొన్నటివరకు కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసిన కేసీఆర్ ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దేశాన్ని ఇన్ని రోజులు పాలించిన బీజేపీ ని బొంద పెట్టాలి, కాంగ్రెస్ ని ఖతం చేయాలని బహిరంగ సభల్లో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్ లో సైతం కేసీఆర్ ఇవే మాటలని రిపీట్ చేశారు. తన స్పీచ్ లో మోదీపై నిప్పులు చెరిగిన కేసీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ పై సాఫ్ట్ కార్నర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చేతిలో చేయి వేయడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది.
కాంగ్రెస్ పై రెండు పాజిటివ్ మాటలు మాట్లాడినంత మాత్రానా కేసీఆర్ కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయినట్టు కాదని వాదించేవాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ అవసరం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు ఇప్పుడు జరగనున్న ఎన్నికలు వేరు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కానీ ఈసారి మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు ప్రధాన పార్టీల బలాబలాలు పరిస్థితులు దాదాపుగా సమానం. ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాదని తప్పకుండా హాంగ్ వస్తదని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విమర్శలు చేస్తున్న బీజేపీతో జతకట్టడం సాధ్యం కాదని భావించిన కేసీఆర్ కాంగ్రెస్ తో దోస్తీకి సిద్దమవుతున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు పరిస్థితులు ఏ మాత్రం సానుకూలంగా లేవు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటుకు ఏడెనిమిది వేలు ఇచ్చినా పట్టుమని పది వేల మెజార్టీ రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం కూడా పడిపోతున్న కేసీఆర్ గ్రాఫ్ కు నిదర్శనం. కేసీఆర్ ఇబ్బడిముబ్బడిగా ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు గాడి తప్పడంతో జనం తీవ్ర ఆగ్రహానికి ఆవేశానికి లోనవుతున్నారు. ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి వచ్చింది. దళిత బంధు, రైతు బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధరణి పోర్టల్ ఏది చూసినా అవకతవకలే కనిపిస్తున్నాయి. దీనితో బీఆర్ఎస్ ఓట్ షేర్ తగ్గిపోతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. దాన్ని సరి చేసుకునేందుకైనా సర్దుబాట్లకు దిగాల్సిన అనివార్యత ఏర్పడుతోందని కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే వారే చెబుతున్నారు.
పొత్తులపై కాంగ్రెస్ లో స్పష్టత లోపించింది. తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని పొత్తు పెట్టుకునే ఆలోచన ఉన్నవాళ్లు పార్టీ నుండి వెళ్లిపోవచ్చని వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ క్లియర్ గా చెప్పారు. ఇటు గులాబీ అగ్రనేతలు సైతం సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తూనే ఉన్నారు. అయినా పొత్తుల విషయం ఇటు కాంగ్రెస్ లో అటు బీఆర్ఎస్ లో చర్చకు వస్తూనే ఉంది. కేసీఆర్ ఇటీవల కాంగ్రెస్ పై చేసిన స్టేట్మెంట్స్ తో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిన క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. రాష్ట్రంలో హాంగ్ వస్తుందని మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాదని వెంకట్ రెడ్డి అన్నారు. వేరే వాళ్ళతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఫైనల్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవక తప్పదని వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరువేరు కాదని ఆపార్టీ ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమయిందని కార్నర్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు సైతం వెంకట్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పాలన పై కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని వెంకట్ రెడ్డి స్టేట్మెంట్స్ పార్టీకి నష్టమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్ ఏం జరిగినా ఆయన చెప్పిన హాంగ్ థియరీలో వాస్తవం లేకపోలేదని రాజకీయాల విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మూడు పార్టీల పరిస్థితి ఒకేలా ఉండడం వల్ల హాంగ్ వస్తే ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి వెళ్లాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో కేడర్ బలం ఉంది. బీఆర్ఎస్ కు కొన్ని ప్యాకెట్స్ లో బలం ఉడటంతో పాటు అధికారబలం అర్థబలం ఉన్నాయి. బీజేపీకి కేడర్ బలం లేదన్న చర్చ జరుగుతున్నప్పటికీ నాయకత్వం కాస్త బలంగా ఉండటంతో పాటు కేంద్రంలో అధికారం వారికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణలో అధికార పార్టీ పట్ల జనంలో ఆసక్తి తగ్గిపోవడం వరుసగా రెండు సార్లు అధికారానికి వచ్చిన తర్వాత సహజంగా ఉండే యాంటీ ఇంకంబెన్సీ కనిపించడం వారికి ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. అందుకే ఒంటరిగా ముందుకు వెళ్లే విషయంపై కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.
కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు ప్రయత్నాలకు ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం పనిచేసే వీలుందన్నది ఒక వాదన. తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వకుండా ఆపాలంటే కాంగ్రెస్ తో చేతులు కలపాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారట. ఆ సలహా కేసీఆర్ కు కూడా బాగా నచ్చిందని చెబుతున్నారు. అయితే రాహుల్ పార్ములా అందుకు కొంత భిన్నంగా ఉంది. ఎన్నికల పొత్తు పెట్టుకోకూడదన్నది రాహుల్ వాదనగా వినిపిస్తోంది. అదే వాదనకు కట్టుబడి ఉన్నా ఫర్వాలేదన్నది బీఆర్ఎస్ వర్గాల ఆలోచన. ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడిన పక్షంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంటుందని హస్తం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే అది ఎన్నికల అనంతర పొత్తు అన్నమాట. మరో పక్క షర్మిల లాంటి వాళ్లు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చి విజయావకాశాలను దెబ్బతీస్తారని ఆ పార్టీ భయపడుతోంది. కాంగ్రెస్ లో నెలకొన్ని విభేదాల కారణంగా కొందరు సీనియర్లు రేవంత్ రెడ్డికి సహకరించడం లేదు. అది కూడా సీట్లు తగ్గిపోవడానికి కారణం కావచ్చు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో కూడా బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి దోహదం చేస్తోందని చెప్పాలి.