ఆర్థిక మంత్రి బుగ్గన బెంగళూరు పెట్టుబడుల సదస్సులో అన్న మాటలు ఇప్పుడు రాష్ట్రమంతా మారుమోగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి కాకరేపుతోంది. ఢిల్లీలో సీఎం జగన్ ప్రకటన ఆపై ఇప్పుడు బుగ్గన స్టేట్ మెంట్ మరింత క్లారిటీ ఇస్తున్నాయని వైసీపీ వర్గాలు జబ్బలు చరుచుకుంటున్నాయి. జగన్ గానీ వైసీపీ నేతలు గానీ ఎక్కడా ఇప్పుడు మూడు రాజధానులు అన్న మాటను వాడటం లేదు. విశాఖ రాజధాని అని చెప్పడం తర్వలోనే అక్కడకు షిఫ్ట్ అవుతామని ప్రకటించడం వెనువెంటనే జరిగి పోతున్నాయి. మూడు రాజధానులు కాదు. అది ఒక్క రాజధానే అదీ విశాఖ మాత్రమేనని బుగ్గన తేల్చేసిట్లయ్యింది.
మూడు రాజధానులు అనేవి మిస్ కమ్యూనికేషన్ అని బెంగళూరు సదస్సులో బుగ్గన ప్రకటించారు. పరిపాలన విశాఖపట్నం నుంచే జరుగుతుంది ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల దృష్ట్యా చూస్తే రాజధానిగా అదే ఉత్తమం తదుపరి అభివృద్ధికీ అవకాశం ఉంటుంది. ఓడ రేవు ఉంది. కాస్మొపాలిటన్ కల్చర్, వాతావరణం అన్ని రకాలుగా విశాఖ అనుకూలమని బుగ్గన తేల్చేశారు. ఇక కర్నూలు రెండో రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ఉంటుందంతే. కర్ణాటకకు ధార్వాడ, గుల్బర్గాలో హైకోర్టు ధర్మాసనాలున్నట్లే కర్నూరులో కూడా ఉంటాయని చెప్పారు. అమరావతిలో శాసనరాజధానిని కూడా బుగ్గన అటకెక్కించేశారు. ఏడాదికి ఒక సారి మాత్రమే గుంటూరులో అసెంబ్లీ సెషన్ పెడతామన్నారు. అందుకోసం దాన్ని శాసన రాజధాని అని పిలవకూడదన్నారు.
అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించిన జగన్ సర్కారు మూడు ముక్కలాట మొదలుపెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అంటూ మూడు రాజధానుల ముచ్చటపై అసెంబ్లీలో వివరించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులోనూ పరిపాలనా రాజధాని న్యాయ రాజధాని శాసన రాజధాని అని ప్రస్తావించారు. వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానుల పేరిట ఊదరగొడుతూనే ఉన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఉండటంతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకున్నారు. రాజధాని రైతులతో కుదిరిన చట్టబద్ధ ఒప్పందాలు రాష్ట్ర విభజన చట్టం ఇతర నిబంధనల దృష్ట్యా అమరావతే రాష్ట్ర రాజధాని అని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. రాజధాని అభివృద్ధికోసం హైకోర్టు విధించిన గడువులపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. వెరసి ఏ రకంగా చూసినా ఇప్పుడు రాష్ట్రానికి అమరావతే రాజధాని. రాష్ట్రస్థాయి కార్యాలయాలేవీ ఇక్కడి నుంచి తరలించేందుకు వీల్లేదు. పైగా అమరావతే రాజధాని అని చెప్పిన తర్వాత కూడా పాదయాత్రలు ర్యాలీలు ఏమిటని హైకోర్టు ఒక సందర్భంలో మండిపడింది. అయినా సరే మంత్రులు నేతలు త్వరలో విశాఖకు, ఏప్రిల్‌లో విశాఖకు, కొన్ని నెలల్లో విశాఖకు అని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన పాలన విశాఖ నుంచే జరుగుతుంది అదే రాజధాని అని బెంగళూరు వేదికగా చెప్పేశారు.
బెంగళూరులో మంత్రి బుగ్గన వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఏమాత్రం తమకు అనుకూలమైన నిర్ణయం వెలువడినా హుటాహుటిన విశాఖ తరలి వెళ్లేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేయకుండా పాలనను విశాఖ తరలించేందుకు జగన్ పూనుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే విశాఖ అభివృద్ధి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. వైజాగ్ లో ఐటికి మంచి స్కోప్ ఉందని చెప్పే వైసీపీ ప్రభుత్వం అక్కడ నుంచి పరిశ్రమలను తరిమేసింది. రిషికొండ ఐటీ పార్కులో భవనాలన్నీ ఖాళీ అయ్యాయి. ఏపీ ఐఐసీ నిర్మించిన రెండు టవర్స్ కూడా ఇంకా లీజుకు ఇవ్వలేదు. టీడీపీ హయాంలో ఇచ్చిన కొన్ని రాయితీలను కూడా వెనక్కి తీసుకున్నారు. పారిశ్రామిక ప్రగతి ఆగిపోయింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకిరణను ఆపలేకపోతున్నారు. మరి ఎలా ముందుకు వెళతారో చూడాలి.