ప్రపంచ క్రికెట్లో టీమిండియా జోరు.. అన్ని ఫార్మాట్లలోనూ అగ్రస్థానం

By KTV Telugu On 15 February, 2023
image

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ఆసీస్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రోహిత్ సేన 115 రేటింగ్‌ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా 111 పాయింట్లతో ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇంగ్లాండ్‌ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టెసుల్లోనూ భారత్ టాప్ ప్లేస్‌లోకి వెళ్లడం ద్వారా ఏకకాలంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా నిలిచిన రెండో జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది.

ఈ ఏడాది న్యూజిలాండ్, శ్రీలంకలతో జరిగిన సిరీస్‌లో సత్తా చాటి వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది టీమిండియా. వన్డే ర్యాంకింగ్స్‌లో 114 పాయింట్లతో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా(112), న్యూజిలాండ్ (111), ఇంగ్లండ్(111), పాకిస్థాన్(106) టాప్-5‌లో ఉన్నాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో 267 రేటింగ్ పాయింట్స్‌తో టీమిండియా టాప్ ప్లేస్‌లో ఉంది. ఇంగ్లండ్(266), పాకిస్థాన్(258), సౌతాఫ్రికా(256), న్యూజిలాండ్(252) తర్వాతి స్థానంలో ఉన్నాయి.

కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లకు సంబంధించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని అందుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా వన్డే, టెస్ట్‌, టీ20ల్లో అగ్రస్థానాన్ని అందుకున్నా ఒకేసారి టాప్ ర్యాంక్ చేరడం ఇదే తొలిసారి. ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్య అగ్రస్థానంలో ఉండగా, నెంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా జడేజా కొనసాగుతున్నాడు. వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా హైదరాబాదీ ఎక్స్ ప్రెస్ సిరాజ్ ఉన్నాడు. నెంబర్ 2 టెస్ట్ బౌలర్‌గా అశ్విన్ ఉన్నాడు.