జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర మొదలయ్యేది ఎప్పుడు. వారాహి వాహనానికి పూజలు పూర్తయి చాలా రోజులే అవుతుంది. కానీ ప్రచార రథం మాత్రం కదలడం లేదు. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. బాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఏఫ్రిల్ నుంచి సీఎం జగన్ కూడా జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. కానీ బస్సు యాత్ర చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాత్రం స్తబ్దుగా ఉన్నారు. బస్సు రెడీగా ఉన్నా రూట్ మ్యాప్ ఇంకా తయారు కాలేదు. దాంతో రాష్ట్రంలో పవన్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో జనసేన కేడర్ ఉంది. వైసీపీ, టీడీపీలు ఇప్పటికే జనంలోకి వెళ్లిపోవడంతో పవన్ రాక కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ బస్సుయాత్ర ఎందుకు ఆలస్యమవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. యాత్ర మొదలుపెడితే మళ్లీ ఆపే అవకాశం ఉండదు కాబట్టి షూటింగ్‌లన్నీ పూర్తిచేసుకొని మొదలుపెడతారనే మాట వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో బాబు ఉన్నారు. రాయలసీమ నుంచి నారా లోకేష్ పాదయాత్రగా వస్తున్నందున పవన్ ఉత్తరాంధ్ర నుంచి బస్సుయాత్ర మొదలుపెడతారనే టాక్ నడుస్తోంది. జగన్ ముందే ఎన్నికల వెళ్తే అటు లోకేష్ ఇటు పవన్‌లు వేర్వేరు ప్రాంతాల్లో యాత్ర పూర్తి చేసుకునే అవకాశముంటుందనే ఆలోచన చేస్తున్నారట. అయితే ఎంచుకున్న నియోజకవర్గాలకే బస్సు యాత్రను పరిమితం చేయాలన్న ఉద్దేశ్యంలో జనసేనాని ఉన్నట్లు చెబుతున్నారు. పొత్తులుంటాయి కాబట్టి తమకు బలమున్న నియోజకవర్గాల్లోనే వారాహి వెళ్లేలా రూట్ మ్యాప్ ను రూపొందించాలని భావిస్తున్నారట. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో తమకు పట్టున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని తెలుస్తోంది. సమయాన్ని బట్టి రాయలసీమలో ఎంపిక చేసిన నియోజకవర్గాలకు బస్సు యాత్రను పరిమితం చేయనున్నారట.
తన వ్యూహం తనకు ఉందంటోన్న పవన్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన లక్ష్యంగా పెట్టుకున్న జనసేనాని బీజేపీని కూడా కలుపుకోవాలని భావిస్తున్నారు. అయితే కమలనాథులు టీడీపీతో కలిసేందుకు ఇష్టపడడం లేదు. అవసరమనుకుంటే జనసేనతో కూడా తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమనే సంకేతాలు పంపుతునన్నారు. ఇప్పుడు బంతి పవన్ కోర్టులోనే ఉంది. ఎవరితో కలిసి వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సింది పవనే. పొత్తులు ఇప్పుడే కాదని ఎన్నికలకు వారం రోజులు ముందే మాట్లాడతానని పవన్ చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుందనే కండీషన్ జనసేన అప్లై చేస్తోంది. మొత్తంగా పొత్తుల విషయం అలా ఉంటే పవన్ ప్రచార యాత్ర విషయంలో మరో డైలమా నడుస్తోంది. జనసేనాని బస్సుయాత్రకు బయలుదేరేదెప్పుడనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో జనసైనికులు నిరాశ చెందుతున్నారు.