వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. పలాస గేమ్ లో గౌతు శిరీష

By KTV Telugu On 16 February, 2023
image

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరు పొందినవారిలో గౌతు శిరీష మొదటి వరుసలో ఉంటారనే చెప్పాలి. నన్నపునేని రాజకుమారి పక్కకు జరిగిన తర్వాత ఇప్పుడు వంగలపూడి అనిత, గౌతు శిరీష, అనురాధ లాంటి వారు పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నారు. ఇప్పుడెందుకో ఒక్కరొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు.

నిజానికి చతురత, చాణక్యం ఉన్న నేతలు రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా గట్టిగా నిలబడిన వారే రాజకీయాల్లో రాటుదేలుతారు. దానికి తగ్గట్లే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన బహుకొద్ది మంది నేతలే సమస్యలకు ఎదురొడ్డి నిలబడుతున్నారనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారిని సీఐడీ కేసులు పెట్టి వేధిస్తున్నప్పటికీ పోరాట పటిమతో రాజకీయాల్లో రాణిస్తున్నారు. కేసులకు భయపడకుండా ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒకరిద్దరు నేతలు ఆ కోవలోకి తీసుకురావచ్చు.

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతూనే ఉంటాయి. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాసలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా గౌతు శిరీష అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. గౌతు కుటుంబానికి ఆ ప్రాంతంలో మంచి పట్టుంది. గౌతు శ్యాంసుందర్ శివాజీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువ రోజులు పలాస ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే శివాజీ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన శిరీష ఆది నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆమెపై కేసులు పెడుతూ వేధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయినా ఆమె పోరాడుతూనే ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉద్యమం అంటే గుర్తుకొచ్చే పేరు గౌతు లచ్చన్న. ఆయన అంతటి నేతగా ఎదగాలని గౌతు శిరీష ప్రయత్నిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శిరీషపై సోషల్ మీడియాకు సంబంధించి అనేక కేసులున్నాయి అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొన్న కేసులు కూడా తోడయ్యాయి. నిత్యం టీవీ డిబేట్లు, ప్రెస్‌మీట్లు, ధర్నాలు, రాస్తారోకోలతో జగన్‌ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడిన శిరీష ఇప్పుడు ఉద్యమాలకు కొంత దూరం జరిగినట్లు కనిపిస్తోంది. దీనితో ఆమె ఇప్పుడేందుకు మౌనంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయా వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పోరాట పటిమను వదిలిపెట్టని శిరీష ఇప్పుడు సైలెంట్ అయిపోవడానికి కారణమేంటని శ్రీకాకుళం జిల్లాలో నేతలు చర్చించుకుంటున్నారు. అదీ ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న వేళ క్రియాశీలంగా ఉండాల్సిన నాయుకురాలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

శిరీష అనుచరులు, రాజకీయంగా ఆమె ఎదుగుదలలో భాగమైన వారు ఇస్తున్న సమాధానం మాత్రం వేరుగా ఉంది. మంత్రి అప్పలరాజు తీరును స్టడీ చేస్తూ ఆయన్న బండారం మొత్తాన్ని నమోదు చేసుకుని ఒకే సారి బ్లాస్ట్ చేసేందుకే శిరీష లో ప్రొఫైల్ లో ఉంటున్నారని చెబుతున్నారు. మినిష్టర్ అప్పలరాజుపై సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున అసమ్మతి చెలరేగుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు జోరందుకున్నాయి. అదీ సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేయడం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. అప్పలరాజుకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ వైసీపీ నేతలే అల్టిమేటం జారీ చేస్తున్నారు. దాంతో కొద్దిరోజులు సైలెంట్‌గా ఉండడమే మంచిదని శిరీష భావిస్తున్నట్లు స్థానిక టీడీపీ నేతలు చెప్తున్నారు. పలాస వైసీపీలో రేగిన అసమ్మతి మంటలు ఎలాగూ టీడీపీ అనుకూలంగా మారుతాయన్న భావనలో గౌతు శిరీష ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ వైసీపీ అంతర్గత కుమ్ములాటలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డ అప్పలరాజు ఇప్పుడు చేతులెత్తేసారు. ఆయా పరిస్థితులను గమనిస్తున్న శిరీష పలాస వైసీపీ అసమ్మతి నేతలు లేవనెత్తుతున్న అంశాలనే ఎన్నికల ముందు ప్రజల్లో ఉంచాలని భావిస్తున్నారు. అందుకోసం సైలెంట్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కానీ ఆమె పూర్తిగా సైడ్ అవ్వలేదని టైమ్ చూసి శివంగి దాడి చేస్తుందని చెబుతున్నారు.